Hyderabad Traffic: ఐటీ కారిడార్‌గా పేరుగాంచిన సైబరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న వాహన రద్దీ, రవాణా ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా నిర్వహిస్తున్న ‘సైబరాబాద్ మూవ్స్–2026’ సదస్సు రెండో రోజు ఆసక్తికర చర్చలతో సాగింది. టీ-హబ్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో ప్రజా రవాణాను ప్రోత్సహించడం, పీక్ అవర్స్‌లో ప్రయాణ సమయాన్ని తగ్గించడం వంటి కీలక అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ సీపీ రమేశ్ మాట్లాడుతూ, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వారం రోజుల్లోనే కాంట్రా-ఫ్లో బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీఆర్టీఎస్) ప్రారంభించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. తొలుత జేఎన్టీయూ నుంచి రాయదుర్గ్ వరకు ఈ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించగా, దీనివల్ల కేపీహెచ్‌బీ, హైటెక్ సిటీ, రాయదుర్గ్ మెట్రో స్టేషన్లకు ప్రయాణికుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
ఆర్టీసీ విస్తరణ ప్రణాళిక.. ఐటీ ఉద్యోగులకు స్పెషల్ బస్సులు:
ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఆర్టీసీ (Hyderabad Traffic)అధికారులు కీలక ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. రాబోయే రెండేళ్లలో సైబరాబాద్ పరిధిలో బస్సుల సంఖ్యను 510 వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల సౌలభ్యం కోసం ప్రత్యేక బస్సు సేవలను ప్రారంభించే అంశంపైనా చర్చలు జరుగుతున్నాయి.
విద్యార్థుల సమస్యలపై ఆరా.. అధికారుల ప్రత్యేక సమావేశం!
సదస్సులో భాగంగా సైబరాబాద్‌లోని వివిధ పాఠశాలల విద్యార్థులతో సీపీ రమేశ్, సీఎంసీ కమిషనర్ సృజన ముఖాముఖి మాట్లాడారు. ప్రతిరోజూ స్కూల్‌కు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా సవాళ్లు, భద్రతా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.




