Union Cabinet: దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, రవాణా, పారిశ్రామిక రంగాల బలోపేతంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం బుధవారం జరిగిన క్యాబినెట్(Union Cabinet) సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.19,934 కోట్ల నిధులను వివిధ ప్రాజెక్టులకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నిర్మాణ, మౌలిక వసతుల పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ (సీఐఈ) మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టం పథకం కింద ఏకంగా రూ.11,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా దేశీయ తయారీ రంగానికి ఊతం లభించడంతో పాటు మౌలిక వసతుల ప్రాజెక్టులు మరింత వేగవంతమవుతాయని కేంద్రం విశ్వాసం వ్యక్తం చేసింది.
పోర్టు, ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులకు భారీ నిధులు:
నౌకాశ్రయాలు, విమానాశ్రయాల అభివృద్ధిలో భాగంగా తమిళనాడులోని కామరాజర్ పోర్టులో రెండో కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు రూ.4,288 కోట్ల నిధులను మంజూరు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే, ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేలా అస్సాంలోని సిల్చార్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు రూ.2,014 కోట్లు కేటాయించింది.
పోస్టల్ శాఖ సేవల బలోపేతానికి కేటాయింపులు:
మౌలిక సదుపాయాలతో పాటు పోస్టల్ రంగ సేవలను ఆధునీకరించేందుకు కూడా కేంద్ర క్యాబినెట్ ప్రాధాన్యత ఇచ్చింది. పోస్టల్ ఆపరేషన్ పథకం కోసం రూ.1,141 కోట్లు, పోస్టల్ శాఖలో ఎస్టేట్స్ మేనేజ్మెంట్ పథకం కోసం మరో రూ.1,491 కోట్లు అందించేందుకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.




