Inter Practical Exams 2027 : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అప్డేట్. 2027లో జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం లేదని ఇంటర్మీడియట్ విద్యా మండలి తేల్చి చెప్పింది. దీంతో విద్యార్థులు తమ సొంత జూనియర్ కాలేజీల్లోనే ప్రాక్టికల్ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించింది. గత విద్యా సంవత్సరం నుంచే ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిపాదించినప్పటికీ.. ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మరోసారి పాత విధానంలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
సాధారణంగా ఇంటర్ వార్షిక థియరీ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అమలవుతోంది. అంటే ఒక కాలేజీ విద్యార్థులకు మరో కాలేజీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. ఇదే విధానాన్ని ప్రాక్టికల్ పరీక్షల్లోనూ ప్రవేశపెట్టాలని బోర్డు గతంలో భావించింది. అయితే ఈ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. దీంతో 2027 ప్రాక్టికల్ పరీక్షలకు కూడా విద్యార్థులు తమ సొంత కాలేజీల్లోనే హాజరుకానున్నారు.
జంబ్లింగ్ విధానం లేకపోవడంతో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు సరైన మూల్యాంకనం చేయకుండానే రెండో సంవత్సరం విద్యార్థులకు ఫీజులు తీసుకుని పూర్తి 30 మార్కులు ఇస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.
సైన్స్ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టుకు 30 మార్కులు కేటాయించారు. తాజాగా మొదటి సంవత్సరం విద్యార్థులకు కూడా ప్రాక్టికల్ పరీక్షలు ప్రవేశపెట్టడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు అదనపు ఫీజులు వసూలు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నాయి. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం, ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ ఇదే..
ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్ : జనవరి 29
ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్ : జనవరి 30
ద్వితీయ సంవత్సరం సైన్స్ ప్రాక్టికల్స్: ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు.
ప్రథమ సంవత్సరం ఇంటర్నల్ అసెస్మెంట్ : జనవరి 20 నుంచి 25 వరకు
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం థియరీ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మొదలవుతాయి. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నట్లు అంచనా.




