Uday Krishna Reddy Case: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఏ1 నిందితుడిగా ఉదయ్ కృష్ణారెడ్డి ఉండగా, తాజాగా ఆయన సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఏ2 నిందితుడిగా చేర్చారు. కేసు విచారణను తప్పుదోవ పట్టించేలా కీలక సాక్ష్యాలను తారుమారు (ట్యాంపర్) చేయడంలో ప్రణయ్ ప్రత్యక్ష పాత్ర పోషించినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలతో సహా గుర్తించారు. ఈ పరిణామంతో సదరు కేసులో విచారణ మరింత వేగవంతమైంది.
సూసైడ్ నోట్, ఐఫోన్ మాయం వెనుక ప్రణయ్ పాత్ర:
పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy Case)ఆత్మహత్యాయత్నం చేసుకున్న సమయంలో రాసినట్లుగా భావిస్తున్న కీలక సూసైడ్ నోట్‌ను ప్రణయ్ కృష్ణారెడ్డి ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టినట్లు పోలీసులు తేల్చారు. అంతేకాకుండా, ఈ కేసుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన వీడియో ఆధారాలు ఉన్న మరో ఐఫోన్‌ను కూడా మాయం చేయడంలో ప్రణయ్ కీలక భూమిక పోషించినట్లు నిర్ధారించారు. సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు చేసి ఏ2గా చేర్చారు.
అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్:
మరోవైపు, పోలీసులు తనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని గ్రహించిన ప్రణయ్ కృష్ణారెడ్డి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసుల అరెస్ట్ నుంచి రక్షణ పొందేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, తదుపరి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.




