నీళ్లెత్తడం చేతకాదు.. దుమ్మెత్తి పోయడమే తెలుసు.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

Must read

  • ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు
  • నీళ్ల విషయంలో కేసీఆర్‌ను ప్రశ్నించే అర్హత రేవంత్‌కు లేదు
  • పాలమూరుకు నీళ్లివ్వలేని సీఎం.. కుప్పానికి ఎలా పారుతున్నాయి

Harish Rao-Revanth Reddy : తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా–గోదావరి జలాల వినియోగం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. ఇవే ప్రధాన అస్త్రాలుగా సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీళ్ల విషయంలో చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే సీఎం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. రేవంత్ రెడ్డి తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీళ్లు అందుబాటులో ఉన్నా వాటిని తెలంగాణ అవసరాలకు ఉపయోగించుకోలేకపోతున్నారని ఆరోపించారు. నీళ్లెత్తడం చేతకాక బీఆర్ఎస్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నోరు పెంచినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావని అన్నారు.

తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర సాధన వరకు కేసీఆర్ చేసిన పోరాటాన్ని హరీశ్ రావు గుర్తుచేశారు. ప్రాణాలకు తెగించి నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించిన నాయకుడిపై సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తెలంగాణ సాధించడం, రాష్ట్ర నీటి హక్కుల కోసం పోరాడటం తప్పా? అని ప్రశ్నించారు.

పాలమూరు ప్రాజెక్టుపై నిలదీత :
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై హరీశ్ రావు ప్రత్యేకంగా స్పందించారు. ప్రాజెక్టులో ఎక్కువ భాగం పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని, కాలువల పనులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం లేదని ఆరోపించారు.

20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. పాలమూరు ప్రాంతంలో పంటలు ఎండిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు.

Read Also : Ineligible Ration Cards: దేశవ్యాప్తంగా భారీగా రేషన్ కార్డుల ఏరివేత.. 2.71 కోట్ల కార్డులు అనర్హుల చేతుల్లోనే.. కేంద్రం సంచలన సర్వే!

బీఆర్ఎస్ హయాంలో కొత్త ఆయకట్టు, స్థిరీకరణ కలిపి 42.77 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో కేవలం 6.64 లక్షల ఎకరాలకే నీళ్లు అందించిందని ఆరోపించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను కూడా తమ ప్రభుత్వమే పరుగులు పెట్టించిందన్నారు.

అనుమతులు, ఏపీ ప్రాజెక్టులపైనా ప్రశ్నలు :

పలు సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల విషయంలోనూ రేవంత్ ప్రభుత్వాన్ని హరీశ్ రావు నిలదీశారు. పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం అదనపు టీఎంసీ, సమ్మక్క సాగర్ తదితర ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెనక్కి రావడాన్ని ప్రస్తావించారు.

మరోవైపు ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పల్నాడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ టెండర్ల విషయంలోనూ ప్రభుత్వం ముందుగానే స్పందించాల్సిందని అన్నారు.

ప్రజల్లోకి అప్పుడే కేసీఆర్ వస్తారు :
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని రేవంత్ చెప్పాడు.. అయితే, రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ నిశితంగా గమనిస్తున్నారని, ప్రజల్లోకి రావాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన వస్తారని హరీష్ రావు చెప్పారు.

ప్రజలకు అన్ని విషయాలు తెలియజేస్తాడన్నారు. హరీష్ రావు డైరెక్ట్ మంత్రి అయ్యానని రేవంత్ రెడ్డి అంటున్నారు. అలాగైతే ప్రధాని మోదీ ఎమ్మెల్యే కాకముందే ముఖ్యమంత్రి అయ్యాడు. నందమూరి హరికృష్ణ డైరెక్ట్ రాజ్యసభకు ఎన్నికయ్యాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తనకు కేసీఆర్ అవకాశం ఇవ్వడంతోనే ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. మొత్తానికి నీటి ప్రాజెక్టుల నుంచి రాజకీయ భవిష్యత్తు వరకు రేవంత్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article