Bhogapuram Accident: విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సుందరపేట సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దైవదర్శనం చేసుకుని ఎంతో సంతోషంగా తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం(Bhogapuram Accident) జరగడం స్థానికంగా కలకలం రేపింది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి.
మృతుల వివరాలు.. విశాఖ వాసులే:
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని విశాఖపట్నం జిల్లా తగరపువలస పరిసర ప్రాంతాలకు చెందిన ఓకలపూడి శ్రీనివాస్, బోర సతీష్, శృతి, కుసుమ రంజనిగా పోలీసులు గుర్తించారు. వీరంతా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీముఖలింగం ఆలయాన్ని దర్శించుకుని తిరిగి విశాఖపట్నం వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల బ్యాగుల్లో ఉన్న నగదు, ఇతర విలువైన వస్తువులను అధికారులు భద్రపరిచారు.
టోల్గేట్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు:
ప్రమాదానికి గురైన తవేరా కారు రాకపోకలపై పోలీసులు ఆరా తీశారు. టోల్గేట్ రికార్డుల ప్రకారం, ఈ కారు అర్ధరాత్రి 12.50 గంటలకు శ్రీకాకుళం వైపు వెళ్లి, తిరిగి ఉదయం 7.35 గంటలకు భోగాపురం టోల్గేట్ దాటినట్లు నమోదైంది. నిద్రమత్తు లేదా అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




