దేశవ్యాప్తంగా భారీగా రేషన్ కార్డుల ఏరివేత.. 2.71 కోట్ల కార్డులు అనర్హుల చేతుల్లోనే.. కేంద్రం సంచలన సర్వే!

Must read

Ineligible Ration Cards: నిరుపేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకం భారీ స్థాయిలో దుర్వినియోగం అవుతున్నట్లు తాజా సర్వేలో తేటతెల్లమైంది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 20.51 కోట్ల ఆహార భద్రతా కార్డులలో ఏకంగా 13.2 శాతం అంటే సుమారు 2.71 కోట్ల కార్డులు అనర్హుల చేతుల్లో ఉన్నాయని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ విభాగం (డీఎఫ్‌పీడీ) నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 51,303 కుటుంబాలు, 4,939 చవక ధరల దుకాణాలు, 245 గోదాముల నుంచి వివరాలు సేకరించగా, సొంత కార్లు, ఏసీలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న సంపన్న కుటుంబాలు సైతం పేదల బియ్యాన్ని పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అనర్హుల కార్డులన్నింటినీ త్వరలోనే పూర్తిగా రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.

Tirupati Special Train: తిరుపతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 14 స్టేషన్లలో హాల్ట్‌తో స్పెషల్ రైలు.. పూర్తి వివరాలు ఇవే!

పట్టణాల్లోనే అనర్హుల శాతం ఎక్కువ:

కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద జారీ చేసిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన కార్డులలో (Ineligible Ration Cards)గ్రామీణ ప్రాంతాల్లో 12.5 శాతం అనర్హులు ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా 15.6 శాతంగా నమోదైంది. అత్యంత నిరుపేదలకు నెలకు 35 కిలోల బియ్యం అందించే అంత్యోదయ అన్నయోజన (ఏఏవై) కార్డుదారుల్లో 12.2 శాతం మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. అలాగే ప్రాధాన్యతా కుటుంబాల్లో (పీహెచ్‌హెచ్) 13.5 శాతం మంది అనర్హులు ఉచిత రేషన్ లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20.27 కోట్ల (98.8 శాతం) కార్డులకు ఆధార్ అనుసంధానం, 71.52 కోట్ల (91 శాతం) మంది లబ్ధిదారులకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయింది.

పశ్చిమ బెంగాల్ టాప్.. అత్యల్పంగా జమ్మూ కశ్మీర్:

అనర్హుల రేషన్ కార్డుల జాబితాలో పశ్చిమ బెంగాల్ ఏకంగా 39.5 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత త్రిపుర (39.2%), తమిళనాడు (38.7%), మేఘాలయ (28.5%), ఒడిశా (22.9%), సిక్కిం (21.9%), పంజాబ్ (20.6%), మహారాష్ట్ర (20.3%) రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, అనర్హుల కుటుంబాలు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో జమ్మూ కశ్మీర్ 0.3 శాతంతో, మధ్యప్రదేశ్ 0.5 శాతంతో నిలిచాయని సర్వే నివేదిక స్పష్టం చేసింది.

గోప్యంగా ఏపీ, తెలంగాణ గణాంకాలు:

కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ఈ నివేదికలో అనర్హులు అత్యధికంగా, అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల జాబితాను మాత్రమే బహిర్గతం చేసింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల పూర్తి వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచింది. ఏదేమైనా, ఈ సర్వే నివేదిక ఆధారంగా కేంద్రం చేపట్టబోయే ప్రక్షాళనతో దేశవ్యాప్తంగా కోట్లాది బోగస్ రేషన్ కార్డులకు చెక్ పడనుండగా, నిజమైన అర్హులకు మరింత మేలు జరిగే అవకాశం ఉంది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article