Phule : సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే. వారి జీవిత ప్రయాణం, వారి సామాజిక పోరాటం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఫూలే’. సమాజంలో నెలకొన్న కులవివక్ష, అసమానతలు, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
మరాఠాలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ అయి నవంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాని సుపదా క్రియేషన్స్ బ్యానర్ పై డా. పొన్నం రవిచంద్ర నిర్మాణంలో అనంత్ మహదేవన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఇటీవల ఈ సినిమాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఫూలే దంపతులు కులవివక్ష నిర్మూలన కోసం, మహిళా విద్య కోసం చేసిన పోరాటం నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు.
మూవీ యూనిట్ మాట్లాడుతూ.. ఫూలే’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. సమాజంలో మార్పు కోసం పోరాడిన ఇద్దరు మహనీయుల జీవితాలను, వారి ఆశయాలను, వారు ఎదుర్కొన్న అడ్డంకులను మన ముందుకు తీసుకొచ్చే ఒక చారిత్రాత్మక కథనం. నేటి యువత, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఫూలే దంపతుల జీవితం గురించి తెలుసుకోవాలి. సమానత్వం, విద్య, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి విలువలను గుర్తుచేసే ఈ సినిమాని థియేటర్లో చూడాలి అని అన్నారు.

