Rahul Gandhi: తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్–2026’కు జాతీయ రాజకీయ దిగ్గజాల రాకతో భాగ్యనగరంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే ఈ మెగా సదస్సులో పాల్గొనేందుకు ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) శుక్రవారం రాత్రి ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఒకవైపు గిగ్ వర్కర్ల హక్కులకు మద్దతుగా నిలుస్తూనే, మరోవైపు అంతర్జాతీయ సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన పాలుపంచుకోనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
శంషాబాద్‌లో బస.. ఉదయమే గిగ్ వర్కర్ల ర్యాలీకి రాహుల్ మద్దతు:
శుక్రవారం రాత్రి శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్న రాహుల్ గాంధీ, శనివారం ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమై రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. అనంతరం నగరంలో నిర్వహించే గిగ్ వర్కర్ల ర్యాలీలో ప్రత్యేకంగా పాల్గొని వారి సమస్యలకు సంఘీభావం తెలుపుతారు. ఆ తర్వాత హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా జరిగే భారత్ సమ్మిట్ ముగింపు ఉత్సవంలో కీలక ప్రసంగం చేసి తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.
బెంగళూరులో ఖర్గే, డీకేలను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి:
ఇదిలా ఉండగా, ఈ అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం బెంగళూరు వెళ్లిన ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌లతో భేటీ అయ్యారు. సమ్మిట్ లక్ష్యాలను వివరిస్తూ ఆహ్వాన పత్రికలు అందజేయగా, ఇరువురు నేతలు హాజరయ్యేందుకు సానుకూలంగా స్పందించారు.


