IPL : ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న జరగనుంది. కాగా.. ఐపీఎల్ 2028 సీజన్‌కు ముందు మెగా వేలాన్ని నిర్వహించనున్నారు. ఈ వేలం వచ్చే ఏడాది డిసెంబర్లో జరిగే అవకాశం ఉంది. ఈ వేలానికి ఏడాదికిపైగా సమయం ఉన్నప్పటికి కూడా ఇప్పటి నుంచే ఫ్రాంఛైజీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తున్నాయి.
మెగా వేలానికి ముందు ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఫ్రాంఛైజీలు అట్టి పెట్టుకునే అవకాశం ఉంది. మిగిలిన వారిని ఖచ్చితంగా విడుదల చేయాల్సి ఉంటుంది. వేలంలో ఆటగాళ్లను సొంతం చేసుకుని జట్టును పునర్ నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు కూడా తమ తమ డిమాండ్లను తెర మీదకు తెచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కొందరు స్టార్ ఆటగాళ్లు తమను జట్టులో కొనసాగించాలంటే (అట్టిపెట్టుకోవాలంటే) రూ.40 కోట్లు చెల్లించాలని ఫ్రాంచైజీలకు ప్రతిపాదించినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే తాము జట్టులో ఉంటామని, లేదంటే వేలానికి వదిలివేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు రూ.40 కోట్ల పారితోషికం ఎవరికీ దక్కలేదు. 2025 ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు వేలంలో ఒక ఆటగాడికి లభించిన అత్యధిక ధర ఇదే.
ప్రస్తుతం ఒక్కో ఐపీఎల్ జట్టు వద్ద రూ.120 కోట్ల వేలం పర్స్ ఉంది. అయితే 2028 మెగా వేలం సమయానికి ఈ మొత్తాన్ని సుమారు రూ.150 కోట్లకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో స్టార్ ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు కోట్ల వర్షాన్ని కురిపించే అవకాశం ఉంది.
గడువు పొడిగింపు..
ఐపీఎల్ 2027 మినీ వేలానికి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్, విడుదల జాబితాలను సమర్పించే గడువును మరో రెండు రోజులు పొడిగించారు. తొలుత నవంబర్ 15గా నిర్ణయించిన గడువును నవంబర్ 17 వరకు పెంచారు. గోవాలో డిసెంబర్ 16న మినీ వేలం జరగనుంది.
ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, విడుదల జాబితాలను సమర్పించిన తర్వాత ఐపీఎల్ నిర్వాహకులు రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను జట్లకు అందజేస్తారు. అనంతరం ఫ్రాంచైజీలు తమకు అవసరమైన ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేస్తాయి. వేలానికి ముందు వారంలో తుది ఆటగాళ్ల జాబితా, వేలం సెట్ల క్రమాన్ని ప్రకటించనున్నారు.


