Athulya Chandra : కొచ్చిలో ఓ డాక్టర్ పై దాడి, దోపిడీకి పాల్పడిన ఆరోపణలకు సంబంధించి మలయాళ నటి, న్యాయవాది అయిన అతుల్య చంద్రను అరెస్టు చేశారు. అత్యవసర వైద్య పరిస్థితి ఉందని, ఇంటికి రావాలని డాక్టర్ ను ఫ్లాట్‌కు రప్పించి ఆయన నుంచి 3.5 లక్షల విలువైన వస్తువులను దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నటితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 2న అతుల్య చంద్ర.. తన మేనత్త అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమెకు తక్షణ వైద్య సహాయం అవసరం, వెంటనే కొచ్చిలోని తమ ఫ్లాట్‌కు రావాలని డాక్టర్‌ను ఫోన్లో కోరింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో డాక్టర్ సదరు ఫ్టాట్కు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ దాదాపు 12 మంది యువతీ, యువకులు ఉన్నారు.
డాక్టర్ లోపలికి వెళ్లగానే అక్కడ ఉన్న వారు అతడిపై దాడి చేశారు. డాక్టర్ వద్ద ఉన్న ఫోన్, స్మార్ట్ వాచ్, వైర్ లెస్ ఇయర్ ఫోన్లను లాక్కుకున్నారు. అతడిని అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ విషయం పోలీసులకు చెబితే.. తమ బంధువుపై అత్యాచారానికి పాల్పడినట్లుగా కేసు పెడతామని బెదిరించారు.
కొన్ని గంటల తరువాత అపార్టుమెంట్ నుంచి తప్పించుకున్న సదరు డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నటితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దోపిడీ చేయడానికే వైద్యుడిని పిలిపించారా? మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


