Sachin Tendulkar : టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 200 టెస్టుల్లో మాస్టర్ బ్లాస్టర్ 15921 పరుగులు సాధించాడు. అయితే.. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన సచిన్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. రూట్ 169 టెస్టుల్లో 14278 పరుగులు చేశాడు. సచిన్ రికార్డును బ్రేక్ చేసేందుకు రూట్ కు మరో 1643 పరుగులు అవసరం.
కాగా.. తన రికార్డును జో రూట్ అధిగమించే అవకాశం ఉండడం పై సచిన్ టెండూల్కర్ స్పందించాడు. 2012లో రూట్ తన తొలి టెస్టు మ్యాచ్ ఆడినప్పుడే అతడిలో గొప్ప ఆటగాడయ్యే లక్షణాలను గుర్తించినట్లు వెల్లడించాడు. మంగళవారం రెడ్డిట్ వేదికగా నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (AMA) కార్యక్రమంలో సచిన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టెస్టు క్రికెట్లో తన అత్యధిక పరుగుల రికార్డును జో రూట్ అధిగమించే అవకాశాలపై ఓ అభిమాని ప్రశ్నించాడు.
దీనికి సచిన్ స్పందిస్తూ.. “జో రూట్‌ను నేను ఎప్పుడూ గొప్ప ఆటగాడిగా భావిస్తాను. అతడి తొలి టెస్టు మ్యాచ్‌లోనే భవిష్యత్తులో రూట్ గొప్ప స్థాయికి చేరుకుంటాడని నాకు స్పష్టంగా అనిపించింది” అని చెప్పాడు.
ప్రస్తుతం టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు.
2012 డిసెంబర్లో నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారానే జో రూట్ సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 229 బంతులు ఎదుర్కొని 73 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో సచిన్ కూడా భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
ఇష్టమైన విదేశీ బ్యాటర్లు వీళ్లే!
తనకు ఇష్టమైన భారతేతర బ్యాటర్లు ఎవరని సచిన్‌ను అడగ్గా.. ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్, జో రూట్‌తో పాటు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ పేర్లను చెప్పాడు.
వన్డే క్రికెట్లో మార్పులు అవసరం..
ఇదిలా ఉంటే.. వన్డే క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు సచిన్ మరోసారి తన ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చాడు. 50 ఓవర్ల మ్యాచ్‌ను రెండు విడతలుగా విభజించి, ఒక్కో జట్టుకు రెండు 25 ఓవర్ల ఇన్నింగ్స్‌లు ఉండాలని సూచించాడు. అయితే మొత్తం 50 ఓవర్లకు కలిపి 10 వికెట్లు మాత్రమే ఉండాలని, మ్యాచ్ మొత్తం ఒకే బంతిని ఉపయోగించాలని అభిప్రాయపడ్డాడు.
నా సూచన చాలా సులభం. 50 ఓవర్ల మ్యాచ్‌ను రెండు 25 ఓవర్ల ఇన్నింగ్స్‌లుగా విభజించాలి. అయితే మొత్తం 50 ఓవర్లకు కలిపి 10 వికెట్లు మాత్రమే ఉండాలి. మ్యాచ్ మొత్తం ఒకే బంతిని ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల బ్యాట్, బంతి మధ్య పోటీ కొనసాగుతుంది. మంచు ప్రభావం ఉన్న పరిస్థితుల్లోనూ రెండు జట్లకు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుంది. దీనివల్ల ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉంటాయి. బౌలర్లు అంతరించిపోయే పరిస్థితి రాకముందే మనం ఏదో ఒక మార్పు చేయాలి. అని సచిన్ అన్నాడు.


