Arnab Cyclone: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ‘అర్నబ్’ తీవ్ర తుపాను కారణంగా దాదాపు రూ.4,600 కోట్ల మేర ఆస్తి, పంట నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. తుపాను(Arnab Cyclone) ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన ముగించిన కేంద్ర ప్రతినిధి బృందం సోమవారం అమరావతి సచివాలయాలలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రత్యేకంగా సమావేశమైంది. బాధితులను ఆదుకోవడంతో పాటు దెబ్బతిన్న మౌలిక వసతులు, రహదారులు, విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణమే ఉదారంగా నిధులు మంజూరు చేయాలని సీఎం కోరారు.
4 జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన.. వరి, కొబ్బరి పంటలకు తీవ్ర నష్టం:
హోం, వ్యవసాయం, జలవనరులు, జాతీయ రహదారుల విభాగాల ఉన్నతాధికారులతో కూడిన ఈ కేంద్ర బృందం బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించింది. పంట చేతికి వచ్చే కీలక సమయంలో తుపాను విరుచుకుపడటంతో వరి, కొబ్బరి, అరటి పంటలకు తీవ్ర విఘాతం కలిగిందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందించడంతో పాటు దెబ్బతిన్న ప్రాంతాల్లో శరవేగంగా విద్యుత్, రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టిన జిల్లా యంత్రాంగాలను బృందం ప్రశంసించింది.
ఏపీ ‘ఆర్టీజీఎస్’, ‘వాట్సాప్ మనమిత్ర’ సాంకేతికతకు కేంద్ర బృందం జోహార్లు:
విపత్తు సమయంలో ప్రాణ, ఆస్తినష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించిన ఆర్టీజీఎస్ (RTGS) సాంకేతికత, ‘వాట్సాప్ మనమిత్ర’ సమాచార వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేశాయని కేంద్ర అధికారుల బృందం కొనియాడింది. ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఉత్తమ విధానాలను దేశంలోని ఇతర రాష్ట్రాల అధ్యయనం కోసం సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు.



