Ap Local Body Elections: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ తుది గణాంకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం(Ap Local Body Elections) అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో కలిపి మొత్తం 62.16 శాతం మేర ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. నగరపాలక సంస్థల విషయానికి వస్తే, ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరపాలికలో అత్యధికంగా 71.27 శాతం ఓటింగ్ జరగగా, దానికి సమీపంలో మచిలీపట్నంలో 70.83 శాతం నమోదు కావడం విశేషం. అదే సమయంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరపాలికలో అతి తక్కువగా 46.85 శాతం మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విశాఖలో 56.32 శాతం పోలింగ్.. మున్సిపాలిటీల్లో చీమకుర్తి టాప్, ఆదోని లాస్ట్:
రాష్ట్రంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థ అయిన విశాఖపట్నంలో 56.32 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఇక పురపాలక సంఘాల (మున్సిపాలిటీల) వర్గంలో ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మున్సిపాలిటీ 84.36 శాతంతో రాష్ట్రంలోనే అత్యధిక ఓటింగ్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు కర్నూలు జిల్లా ఆదోని పురపాలికలో అతి తక్కువగా 53.6 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.



