- పోలీసులపైనే తిరగబడ్డ హేమంత్..
- ఆత్మకూరు అడవుల్లో ఆరు రౌండ్ల కాల్పులు
- పోలీసుల నుంచి తప్పించుకునే యత్నం..
- పోలీసుల కాల్పుల్లో తీవ్ర గాయాలు
Rapthadu Attack Case : రాప్తాడు బాలికపై జరిగిన కిరాతక దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాఠశాల తరగతి గదిలోకి చొరబడి ఎలక్ట్రిక్ రంపంతో పదో తరగతి విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడు హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపారు.
ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై హేమంత్ తిరగబడటంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు 6 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో హేమంత్ తీవ్రంగా గాయపడగా, పోలీసులు అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగింది? :
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అయ్యవారిపల్లికి చెందిన 15 ఏళ్ల గోపిక పదో తరగతి చదువుతోంది. ఆమె తరగతి గదిలో ఉండగా, వరుసకు బాబాయ్ అయ్యే హేమంత్ ఒక్కసారిగా ఎలక్ట్రిక్ చైన్సాతో లోపలికి ప్రవేశించాడు. ఏమాత్రం కనికరం లేకుండా బాలికపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో గోపిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి..
Read Also :
అదే సమయంలో దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని లక్ష్మి కూడా గాయపడింది. హేమంత్‌ను నిలువరించే క్రమంలో ఆమె 2 కాళ్లకు గాయాలయ్యాయి. విద్యార్థుల కేకలతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఆత్మకూరు అడవుల్లో 6 రౌండ్లు :
మరోవైపు నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు హేమంత్ ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు హేమంత్ ప్రయత్నించడంతో పోలీసులు 6 రౌండ్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇదిలా ఉండగా, గోపిక, లక్ష్మిలను తొలుత అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గోపికను బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పోలీసుల కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు, హేమంత్ పరిస్థితిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది..



