- వైసీపీపై జనసేన రిగ్గింగ్ ఆరోపణలు
- చివరి నిమిషంలో పిఠాపురంలో ఉద్రిక్తత..
- పిఠాపురంలో రీ పోలింగ్‌కు జనసేన డిమాండ్
Jana Sena Pithapuram Tension : కాకినాడ జిల్లా పిఠాపురంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ చివరి నిమిషాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. ఉదయం నుంచి ప్రశాంతంగా సాగిన పోలింగ్.. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత రాదాలపేటలో ఉద్రిక్తతకు దారితీసింది. 18, 19 వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ల విషయంలో తలెత్తిన వివాదం జనసేన ఆందోళనకు కారణమైంది..
అసలేం జరిగిందంటే..
పోలింగ్ కేంద్రంలో వైసీపీ, స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లను అనుమతించి, జనసేన అభ్యర్థి, ఏజెంట్‌ను మాత్రం లోపలికి అనుమతించలేదని ఆ పార్టీ శ్రేణులు ఆరోపించాయి. అంతేకాదు, జనసేన ఏజెంట్లను బయటకు పంపించారని మండిపడ్డాయి. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ 19వ వార్డులో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశాయి..
Read Also :
విషయం తెలుసుకున్న కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అక్కడికి చేరుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు. మరోవైపు కొందరు జనసేన కార్యకర్తలు గోడలు దూకి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది..
కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో డీఎస్పీ చివరకు ఎంపీ ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీకి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు రంగంలోకి దిగారు. జనసేన, వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.
చివరకు ఎంపీ, ఎమ్మెల్యే, జనసేన నాయకులు పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. అయితే, 19వ వార్డులో రిగ్గింగ్ జరిగిందన్న జనసేన ఆరోపణలపై ఎన్నికల అధికారులు ఎలా స్పందిస్తారు? రీ పోలింగ్ నిర్వహిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..



