Cm Revanth Reddy: దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి చేపట్టిన ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ భారీ బహిరంగ సభ, మార్చ్ రాజకీయంగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. మింటో రోడ్ – కన్నాట్ ప్లేస్ జంక్షన్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ రామ్లీలా మైదానం వరకు కొనసాగనుండగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 2023 ఎన్నికల కమిషన్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయడంతో పాటు ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను నిలిపివేసి, రాబోయే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలని ఇండియా కూటమి నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ నుంచి ఢిల్లీకి భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు:
ఈ ప్రతిష్టాత్మక ర్యాలీ కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్, కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 77 బస్సులు, 600 కార్లలో సుమారు 7 వేల మందికి పైగా కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీలోని తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) ప్రసంగిస్తూ, రాబోయే పోరాటంలో ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అక్కడ నుంచే నాయకులు రామ్లీలా మైదానానికి ర్యాలీగా బయలుదేరారు.
బీజేపీ ‘ఓట్ చోరీ’పై రాహుల్ గాంధీ పోరాటం.. రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు:
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతూ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. దేశంలో పేద ప్రజల ఓట్లను పెద్ద ఎత్తున ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ అక్రమాలపై సుదీర్ఘ పోరాటం కొనసాగుతుందని, కేంద్రంలో బీజేపీ గద్దె దిగే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.



