- రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పోలింగ్ ముగింపు
- క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం
- పులివెందులలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు
AP Local Body Elections : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. చివరి నిమిషం వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్ సమయం ముగిసే సరికి క్యూలైన్లలో ఉన్నవారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అవకాశం దక్కింది.
రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు 48.03 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 3న వెలువడనున్నాయి..
Read Also :
పులివెందులలో ఉద్రిక్తతలు.. :
కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మరోవైపు పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించినట్టు తెలిపారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు పులివెందులలో 61.18 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. మొత్తం 80 పోలింగ్ బూత్‌లలో 47 మంది ఏజెంట్లు ఉదయం 7 గంటలలోపే రిపోర్ట్ చేశారని వివరించారు. అయితే, ఉదయం 11.30 గంటల తర్వాత కొందరు ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలను విడిచివెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. పోలింగ్ ప్రక్రియపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.
మొత్తానికి ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి చూపు ఫలితాలపైనే ఉంది. మొత్తం 10,262 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, నవంబర్ 3న ఓట్ల లెక్కింపుతో ఏ పట్టణంలో ఏ పార్టీ పైచేయి సాధించిందో తేలిపోనుంది.



