Cyclone Murasu: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం చెన్నైకి 1140 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వ్యవస్థ రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది. అనంతరం ఆదివారం సాయంత్రానికి ఇది మరింత తీవ్రరూపం దాల్చి ‘మురసు’ (Cyclone Murasu) తుపానుగా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న ఈ తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 2 నాటికి ఏపీ తీరం సమీపంలోకి.. మత్స్యకారులకు తీవ్ర హెచ్చరికలు:
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ‘మురసు’ తుపాను వాయువ్య దిశగా పయనిస్తూ నవంబర్ 2వ తేదీ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఆంధ్రప్రదేశ్ తీరం సమీపంలోకి చేరుకోనుంది. తుపాను తీవ్రత దృష్ట్యా సముద్రంలో గాలుల వేగం గంటకు 50 నుండి 60 కిలోమీటర్లకు పైగా పెరిగే అవకాశం ఉండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే సురక్షిత తీరాలకు తిరిగి రావాలని వాతావరణ కేంద్రం సూచించింది.
అప్రమత్తంగా ఉండాలన్న ఏపీఎస్డీఎంఏ.. ప్రజలకు హెచ్చరికలు జారీ:
బంగాళాఖాతంలో తుపాను ముప్పు పెరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలను అప్రమత్తం చేశారు. తీర ప్రాంత జిల్లాల యంత్రాంగం ఇప్పటికే ముందస్తు భద్రతా చర్యలు చేపట్టిందని, ప్రజలు కూడా వాతావరణ పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం విపత్తు నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్లను సిద్ధం చేసిందని, అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఆయన స్పష్టం చేశారు.



