- PPF ఖాతాను ఫ్రీజ్ చేస్తారా? పన్ను బకాయిలుంటే ఏమౌతుంది?
- పీపీఎఫ్ డబ్బులను ఐటీ శాఖ జప్తు చేయగలదా? చట్టం ఏం చెబుతోంది?
- పన్ను బకాయిలున్నాయా? మీ పీపీఎఫ్ డబ్బులకు రక్షణ ఉందా?
PPF Savings Tax : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF).. భవిష్యత్తు అవసరాల కోసం చాలామంది ఎంచుకునే సురక్షితమైన సేవింగ్స్ స్కీమ్.. అయితే, మీపై ఆదాయపు పన్ను బకాయిలు ఉంటే.. పీపీఎఫ్ ఖాతాలో దాచుకున్న డబ్బులను కూడా ఆదాయపు పన్ను శాఖ తీసుకుంటుందా? మీ ఖాతాను ఫ్రీజ్ చేస్తుందా? ఈ విషయంలో చట్టం ఏం చెబుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పీపీఎఫ్ డబ్బులకు చట్టపరమైన రక్షణ :
ఆదాయపు పన్ను బకాయిలు చెల్లించలేదని మీ పీపీఎఫ్ ఖాతాలోని డబ్బులను నేరుగా జప్తు చేయలేరు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చట్టం, 1968లోని సెక్షన్ 9 ప్రకారం.. ఖాతాలో (PPF Savings Tax) ఉన్న బ్యాలెన్స్‌కు కొన్ని సందర్భాల్లో అటాచ్మెంట్ నుంచి రక్షణ లభిస్తుంది.
గుజరాత్ హైకోర్టు కూడా 2014లో దినేష్ చంద్రా భలియాల్ భాయ్ గాంధీ వి. టాక్స్ రికవరీ అధికారి కేసులో పీపీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని ఆదాయపు పన్ను బకాయిల వసూలు కోసం అటాచ్ చేయడంపై కీలక తీర్పు ఇచ్చింది. అంటే, పీపీఎఫ్‌లో డబ్బులు ఉన్నాయనే కారణంతో వాటిని వసూలు చేయడం అంత ఈజీ కాదు అనమాట..
డబ్బులు విత్‌డ్రా చేస్తే జాగ్రత్త :
అయితే, ఇక్కడే ముఖ్యమైన విషయం.. పీపీఎఫ్ ఖాతాలో డబ్బులు ఉన్నంతవరకే ఈ రక్షణ వర్తించే అవకాశం ఉంటుంది. మీరు ఆ డబ్బులను విత్‌డ్రా చేసి సాధారణ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తే పరిస్థితి మారవచ్చు.
Read Also :
ఉదాహరణకు.. మీ పీపీఎఫ్ ఖాతాలో రూ.10 లక్షలు ఉన్నాయనుకుందాం.. పన్ను బకాయిలు కూడా ఉన్నాయి.. ఆ మొత్తంలో రూ.5 లక్షలు విత్‌డ్రా చేసి సాధారణ బ్యాంక్ ఖాతాలో వేస్తే, ఆ డబ్బులకు పీపీఎఫ్‌లో ఉన్న రక్షణ యథాతథంగా కొనసాగుతుందని భావించకూడదు. చట్టపరమైన నిబంధనల ప్రకారం ఆ మొత్తంపై రికవరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
పన్ను కట్టకపోతే ఏం చేస్తారు? :
పీపీఎఫ్ డబ్బులకు రక్షణ ఉన్నంత మాత్రాన పన్ను బకాయిలు రద్దయిపోవు. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం.. బ్యాంక్ ఖాతాలు, జీతం, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఇతర ఆస్తులపై చర్యలు తీసుకోవచ్చు.
ఇప్పటికే ఖాతాను ఫ్రీజ్ చేస్తే? :
మీ పీపీఎఫ్ ఖాతాపై అటాచ్మెంట్ లేదా ఫ్రీజ్ ఆర్డర్ వస్తే వెంటనే ఆందోళన అవసరం లేదు. ముందుగా ఆర్డర్ కాపీ తీసుకుని, ఏ చట్టం కింద చర్యలు తీసుకున్నారో చెక్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లతో సంబంధిత ట్యాక్స్ రికవరీ అధికారికి రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేయవచ్చు. అవసరమైతే న్యాయ నిపుణుడి సలహా తీసుకోవాలి.
పీపీఎఫ్‌లోని డబ్బులకు చట్టపరమైన రక్షణ ఉన్నా అది పన్ను బకాయిల నుంచి పూర్తి మినహాయింపు కాదు. పన్ను నోటీసులను నిర్లక్ష్యం చేయొద్దు.. బకాయిలు వివాదాస్పదంగా మారితే తగిన సమయంలో అప్పీల్ లేదా స్టే కోసం ట్రై చేయడమే బెటర్..



