- బంగారం ధర తగ్గినా కొనుగోళ్లు నిల్..
- బంగారం ధర ఇంకా పడుతుందనే ఆశలో నగల వ్యాపారులు
- పండుగ సీజన్లోనూ గోల్డ్‌కు షాక్.. కొనుగోళ్లకు వెనకడుగు
India Gold Prices : బంగారం ధరలు తగ్గుతున్నా.. కొనుగోళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్న భారతీయ నగల వ్యాపారులు ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
సాధారణంగా పండుగల సమయంలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. కానీ, ఈసారి సీన్ కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. ధరలు తగ్గినప్పటికీ బడా జువెలరీ సంస్థలు మాత్రం పూర్తిస్థాయిలో కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు.
ధర ఇంకా తగ్గుతుందనే అంచనా :
భారత్‌లోని ప్రముఖ బంగారు శుద్ధి సంస్థ ఎంఎంటీసీ-పీఏఎంపీ (MMTC-PAMP) అధిపతి సమిత్ గుహా వివరాల ప్రకారం.. ప్రస్తుతం చిన్న, మధ్యస్థాయి నగల వ్యాపారులే ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. కొందరు మళ్లీ మళ్లీ ఆర్డర్లు కూడా ఇస్తున్నారు. అయితే పెద్ద నగల సంస్థలు మాత్రం ధరల కదలికలను గమనిస్తూ వేచి చూస్తున్నాయి.
బంగారం ధరలు పెరుగుతాయని అనిపించినప్పుడు వ్యాపారులు ముందుగానే కొనుగోళ్లు చేస్తారు. ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని భావిస్తే మాత్రం కొత్తగా బంగారం కొనకుండా పాత నిల్వలతోనే వ్యాపారం కొనసాగిస్తారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
Read Also :
దిగుమతి సుంకం ప్రభావం :
అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత బంగారం ధరలు భారీగా పెరిగాయి. జనవరిలో ఔన్సుకు 5,400 డాలర్లకు పైగాచేరిన ధరలు, ఇటీవల 4,000 డాలర్ల దిగువకు పడిపోయాయి. అయినప్పటికీ దేశీయ మార్కెట్లో కొనుగోళ్లు పుంజుకోవడం లేదు..
గత మే నెలలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచడం కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది. భారత్ తన అవసరాలకు సరిపడా బంగారంలో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. మరోవైపు, వాణిజ్య లోటును తగ్గించేందుకు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా పలుమార్లు పిలుపునిచ్చారు.
పండుగ సీజన్లో జరిగేదేంటి? :
దీపావళి సహా పండుగల కారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు బంగారానికి సాధారణంగా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే, ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం, దిగుమతి నిబంధనలు కఠినంగా ఉండటం వల్ల కొనుగోళ్లు బలహీనంగా ఉండొచ్చని అంచనాలున్నాయి.
ఎంఎంటీసీ-పీఏఎంపీ బంగారం అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. చిన్న నాణేలు, బార్ల కొనుగోళ్లకు కొంత ఆదరణ కనిపిస్తోంది. సెప్టెంబర్‌లో అమ్మకాలు దాదాపు గత ఏడాది స్థాయిలోనే ఉండగా అక్టోబర్‌లో స్వల్పంగా పెరిగాయి. మొత్తానికి, బంగారం ధరలు మళ్లీ పెరగడం మొదలైతే కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం ఉందని నగల వ్యాపారులు భావిస్తున్నారు.


