Hardik Pandya : తమ అభిమాన ఆటగాడిని ఒక్కసారైనా కలవాలని, అతడితో ఓ ఫొటో దిగాలని ఎంతోమంది ఫ్యాన్స్ కలలు కంటుంటారు. ఆ కలను నిజం చేసుకునేందుకు కొందరు ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు. అచ్చం ఇలాగే భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కలవాలనే కోరికతో ఓ అభిమాని ఏకంగా వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాడు.
లక్నోకు చెందిన రవికి హార్దిక్ పాండ్యా అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలో హార్దిక్ ను కలుసుకునేందుకు ముంబైకి వెళ్లాడు. అయితే.. పాండ్యా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న రవి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముంబై నుంచి కాలినడకన బెంగళూరుకు వెళ్లాలని భావించాడు. వెంటనే ఓ ఫ్లకార్డు చేతబట్టుకుని దాదాపు 1000 కి.మీ కాలినడకన ముంబై నుంచి బెంగళూరుకు చేరుకున్నాడు.
Hardik Pandya met a fan who walked all the way from Mumbai to Bengaluru just to meet him, Hardik also arranged his return ticket.
https://t.co/dRSjihsOHW
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 20, 2026
ఈ విషయం తెలుసుకున్న హార్దిక్ పాండ్యా తనను కలవడానికి వచ్చిన అతడిని సాదరంగా ఆహ్వానించాడు. ఆప్యాయంగా పలకరించి కాసేపు ముచ్చటించాడు. నీవు ఎలా ఉన్నావు? నీకు ఏమైనా కావాలా? నీ కోసం నేను ఏమైనా చేయగలనా? అని అతడిని హార్దిక్ అడిగాడు. అంతేకాదండోయ్.. అతడి తిరుగు ప్రయాణానికి రైలు టికెట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. తప్పకుండా మళ్లీ కలుద్దామని సదరు అభిమానికి హార్దిక్ ప్రామిస్ చేశాడు. హార్దిక్ చూపించిన ఆప్యాయతతో సదరు అభిమాని ఆనందంతో ఉబ్బితబ్బిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత కొంతకాలంగా గాయంతో హార్దిక్ బాధపడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులో కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు న్యూజిలాండ్ సిరీస్కు కూడా దూరం అయ్యాడు. అతడు కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధిస్తే జింబాబ్వేతో జరగనున్న వన్డే సిరీస్లో బరిలోకి దిగే అవకాశం ఉంది.

https://t.co/dRSjihsOHW
