Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి హీరో ధనుష్ ఎంట్రీ ఎవ్వబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ధనుష్ ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఎన్నికల సంఘంలో నమోదు చేశారంటూ వార్త వచ్చాయి. అయితే, దీనిపై అధికారికంగా ధనుష్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, ధనుష్ ఇటీవలకాలంలో వరుస మీటింగ్లు నిర్వహిస్తుండటంతో ఆయన రాజకీయ రంగప్రవేశం ఖాయమని, ఆ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తమిళ రాజకీయాల్లో చర్చ జరుగుగుతంది.
Also Read : CM Revanth Reddy : స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి దసరా వేడుకలు
కొన్ని నెలలుగా తన అభిమాన సంఘాల ద్వారా క్షేత్ర స్థాయిలో ధనుష్ సామాజిక కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అభిమాన సంఘం తమకంటూ ఒక ప్రత్యేకమైన రెడ్, వైట్ కలర్స్ జెండాను కూడా ఆవిష్కరించడం ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే, ధనుష్ రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలపై తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ నేత స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు.
టీవీకే అధికార ప్రతినిధి ఎం. సత్యకుమార్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు. ధనుష్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే స్వాగతిస్తామని చెప్పారు. తమ పార్టీ ప్రయాణం ఇతరులు రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తిగా నిలవడం సంతోషంగా ఉందని అన్నారు. విజయ్ హీరోగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే సినిమాలను వదిలి రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. విజయ్ రాజకీయాల్లోకి రావడానికి 30ఏళ్లపాటు కృషి చేశారు. ఇది అంత సులభమైన ప్రయాణం కాదు.
రాజకీయ పార్టీని స్థాపించడం ఒక ఎత్తయితే, దానిని నిలబెట్టుకోవటం.. అధికారంలోకి తీసుకురావడం మరో ఎత్తు. రాజకీయాల్లోకి రావాలనుకునేవారు పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందని టీవీకే అధికార ప్రతినిధి ఎం. సత్యకుమార్ అన్నారు.
ఇదిలాఉంటే.. తమిళనాడు రాజకీయాల్లోకి సినీ ప్రముఖులు ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. తమిళనాడులో రాజకీయాలు, సినిమాలను వేరుగా చూడలేము. సీఎన్ అన్నాదురై, ఎం. కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత.. ఇప్పుడు విజయ్.. సినిమా పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి కీలక పాత్ర పోషించారు. అయితే, శివాజి గణేశన్, విజయకాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్ వంటి నటులు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ అత్యున్నత పదవిని అదిరోహించలేక పోయారు.
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని గత ఎన్నికల ముందు విస్తృత ప్రచారం జరిగినా.. తాను రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల ఎన్నికల్లో విజయ్ ఘన విజయం సాధించి సీఎం పీఠాన్ని అదిరోహించడం తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. విజయ్ తరహాలోనే సీఎం పీఠాన్ని అధిరోహించాలని ధనుష్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారని.. అందుకోసం క్షేత్ర స్థాయిలో బలమైన పునాదులు వేసుకొనేందుకు ప్రక్రియ కొనసాగుతోందని తమిళనాట రాజకీయాల్లో చర్చ జరుగుతుంది.


