Telangana Woman China Espionage Case : జమ్మూ కశ్మీర్‌లో సైనికాధికారి భార్య, సికింద్రాబాద్‌కు చెందిన మహిళ ఏఐ టూల్స్ ఉపయోగించుకుని చైనా నిఘా వర్గాలకు భారత సైనిక రహస్యాలు చేరవేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తాజాగా సదరు మహిళపై గూఢచర్యం కేసు నమోదు చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Hindu Temple In Pakistan : పాకిస్థాన్‌లో 200 ఏళ్ల పురాతన హిందూ ఆలయానికి తాళం..
జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారంపై విశ్లేషణాత్మక పత్రాల ద్వారా ఆమె గూఢచర్యం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సదరు మహిళలకు విదేశీయులతో పరిచయాలు, వాట్సాప్ సంభాషణలు, మొబైల్ ఫోన్‌లో లభించిన సమాచారంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. అసలు ఆమె పరిశోధకురాలిగానే పనిచేశారా? లేక ఆ ముసుగులో సైనిక రహస్యాలు చేరవేశారా? ఈ కేసులో వెలుగులోకి వస్తున్న అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
అయితే, అక్టోబర్ 14న జమ్మూ తావి రైల్వే స్టేషన్‌లో కేంద్ర నిఘా సంస్థ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. ప్రస్తుతం ఆమెను అరెస్టు చేయలేదని, దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నారని అధికారులు తెలిపారు.
సదరు మహిళ జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LoC) పరిస్థితులు, అరుణాచల్‌ప్రదేశ్‌లో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, డ్రోన్ల వినియోగం వంటి రక్షణ, భద్రత, భౌగోళిక రాజకీయ అంశాలపై విశ్లేషణాత్మక పత్రాలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ పరిశోధనలో ChatGPT, Claude వంటి ఏఐ సాధనాలను ఉపయోగించినట్లు కూడా అధికారులు పేర్కొన్నారు.
2021లో బెంగళూరులోని యూనివర్సిటీ నుంచి ఆమె అంతర్జాతీయ సంబంధాల్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2022లో జెనీవాలో మాస్టర్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ యూరోపియన్ అండ్ ఇంటర్నేషనల్ గవర్నెన్స్ పూర్తి చేశారు. 2023 అక్టోబర్ నెలలో సైన్యంలో మేజర్‌గా పనిచేస్తున్న అధికారిని సదరు మహిళ వివాహం చేసుకున్నారు. ఆమె గతంలో ఐక్యరాజ్యసమితి (UN)కు సంబంధించిన ఐటీ ఇంటర్న్‌షిప్ చేసినట్లు, పలు విదేశీయులతో పరిచయాలు కలిగి ఉన్నట్లు విచారణలో వెల్లడైందని అధికారులు చెబుతున్నారు.
2024లో ఆమె సోషల్ మీడియా ద్వారా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న మలేసియా జాతీయులతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. వారు చైనా నిఘా వర్గాల కోసం పని చేస్తున్నట్లు వెల్లడైందని వివరించారు. అయితే, విదేశీ వ్యక్తులకు ఎలాంటి సున్నితమైన సమాచారం చేరవేసింది? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఆమె మొబైల్ ఫోన్‌ను ప్రాథమికంగా విశ్లేషించగా.. భారత్-ఇటలీ రక్షణ బంధంపై మానెక్ షా సెంటర్‌లో జరిగిన సమావేశానికి సంబంధించిన రహస్య అంశాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. భారత సైన్యాధిపతి అమెరికా పర్యటన వివరాలు, భారత్-రష్యా రక్షణ ఒప్పందం, అరుణాచల్ ప్రదేశ్‌లోని కలై-2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, కమలా ప్రాజెక్టుల వివరాలు, కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్, భారత్-సీషెల్స్ సంబంధాలు, అస్సాంలోని ప్రాజెక్టులు, భారత్-చైనా సంబంధాల వివరాలున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. సదరు మహిళకు సంబంధించిన డిజిటల్ పరికరాలు, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరుగుతుంది.


