Telangana Government : ఎల్‌నినో ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే వానాకాలం సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. అంతేకాక పంటల దిగుబడిసైతం భారీగా తగ్గింది. దీంతో రైతులు ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోతున్నారు. యాసంగిలోనూ ఇదే పరిస్థితి ఉండటంతో ఈ సీజన్లో రైతులను తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటల సాగు వైపు మళ్లించేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.
Also Read : Saddula Bathukamma Celebrations : తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరం.. ట్యాంక్‌బండ్‌పై పూల జాతర..!
యాసంగిలో నూనెగింజలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో రైతులకు రాయితీపై విత్తనాలు అందించడంతో పాటు ఉద్యాన పంటల సాగు పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులు దృష్టిసారించారు. ఈ ప్రణాళిక అమలుకు విత్తనాల రాయితీ కోసం రూ.224 కోట్లు, ఉద్యాన పంటల ప్రోత్సాహం, విస్తరణ కోసం రూ.296.88 కోట్లు అవసరమవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సమర్పించాలని సూచించడంతో వ్యవసాయశాఖ ఇటీవల నివేదికను అందజేసింది.
వానాకాలంలో ఎదురైన వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపాయని నివేదికలో పేర్కొంది. సమయానికి వర్షాలు కురవకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు ఆలస్యంగా వేయాల్సి వచ్చిందని, నేలలో తేమ తగ్గడంతో మొక్కల పెరుగుదల మందగించి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని వివరించింది. ఈ ప్రభావం యాసంగి సాగుపైనా పడే అవకాశం ఉండటంతో నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలని రైతులకు వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే సూచించారు.
యాసంగిలో నీటి వినియోగాన్ని తగ్గించేందుకు నూనెగింజలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగును విస్తరించాలని వ్యవసాయశాఖ భావిస్తోంది. రాయితీ విత్తనాల పంపిణీతో రైతుల పెట్టుబడి భారం తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల ద్వారా ఆదాయ అవకాశాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత ఆధారంగా పంటల ఎంపికపై రైతులకు మార్గనిర్దేశం చేయనుంది.
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, నీటి పొదుపు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు గ్రామాల వారీగా రైతు మేళాలు, గ్రామసభలు నిర్వహించాలని ప్రతిపాదించింది. సంబంధిత శాఖలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల సమన్వయంతో రైతులకు సూచనలు అందించనుంది. మల్చింగ్ పద్ధతి, వ్యవసాయ కుంటల ఏర్పాటు, వర్షపు నీటి నిల్వ వంటి చర్యలను ప్రోత్సహించనుంది. నీటి వనరులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుని ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టడం ద్వారా వాతావరణ ప్రతికూలతలను తగ్గించవచ్చని వ్యవసాయశాఖ సూచించింది.


