- టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ఓజా..
- ప్రజ్ఞాన్ ఓజా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
- రమేశ్ పవార్‌కు సెలక్షన్ కమిటీలో చోటు
Pragyan Ojha Salary : మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది.. భారత క్రికెట్లో మరో కీలక బాధ్యతను అప్పగించింది. టీమిండియా పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఆయన్ను నియామించడంతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు.
ఈ చీఫ్ సెలెక్టర్ పదవికి అందుకునే రెమ్యునరేషన్‌పై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఓజా ఏడాదికి ఎంత సంపాదించబోతున్నారు? క్రికెటర్‌గా ఆయన సాధించిన ఘనతలేంటి? అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఏడాదికి రూ.3 కోట్లు :
మీడియా కథనాల ప్రకారం.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజాకు ఏడాదికి సుమారు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ అందనుంది. అంటే నెలకు సగటున రూ.25 లక్షలు అన్నమాట. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన అజిత్ అగార్కర్‌కు కూడా ఇదే స్థాయిలో రెమ్యునరేషన్ అందినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, ఓజా జీతానికి సంబంధించిన అధికారిక వివరాలను బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతానికి ఆయనకు రూ.3 కోట్ల జీతం అందనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో క్లారిటీ లేదు.
ఓజా క్రికెట్ కెరీర్ అదుర్స్ :
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన ప్రజ్ఞాన్ ఓజా.. భారత జట్టు తరఫున 24 టెస్టులు ఆడి 113 వికెట్లు పడగొట్టారు. 18 వన్డేల్లో 21 వికెట్లు, 6 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 10 వికెట్లు సాధించారు. 2009 నుంచి 2013 మధ్య అంతర్జాతీయ క్రికెట్లో కీలకంగా వ్యవహరించారు.
ఐపీఎల్‌లోనూ ఓజా ప్రయాణం అద్భుతం.. డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన ఆయన ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టులో చేరారు. 2015 వరకు ఐపీఎల్లో కొనసాగారు. అనంతరం కామెంటరీ రంగంలోనూ రాణించారు.
సెలక్షన్ కమిటీపై భారీ బాధ్యత :
అజిత్ అగార్కర్ తప్పుకున్న తర్వాత తాత్కాలికంగా చైర్మన్ బాధ్యతలు నిర్వహించిన ఓజాకు ఇప్పుడు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. టెస్టు అనుభవం, సీనియారిటీ ఆయనకు కలిసొచ్చిన అంశాలుగా చెప్పొచ్చు.
మరోవైపు మాజీ క్రికెటర్ రమేశ్ పవార్‌కు కూడా సెలక్షన్ కమిటీలో చోటు దక్కింది. ఆర్పీ సింగ్, శివ సుందర్ దాస్, అజయ్ రాత్రాలతో ఆయన కలిసి పనిచేయనున్నారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడంతో పాటు జట్టు కూర్పుపై సరైన నిర్ణయాలను ఈ కమిటీ తీసుకోనుంది.


