FMCG Price Hike : దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం కారణంగా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు క్రమంగా ఇబ్బందులు తీవ్రమవుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆహార ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు మరో భారం పడే అవకాశం ఉంది.
Also Read : X Video Kickstart Bonus : కంటెంట్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్.. 15 వీడియోలు పోస్ట్ చేస్తే రూ.2.85 లక్షలు!
ముడిసరుకుల ఖర్చులు పెరగడంతో డిసెంబర్ నుంచి ఎఫ్ఎంసీజీ (FMCG) ఉత్పత్తుల ధరలను పెంచాలని పలు కంపెనీలు యోచిస్తున్నాయి. బిస్కెట్లు, చాక్లెట్లు, వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు వంటి నిత్యం వినియోగించే ఉత్పత్తుల ధరలు పెరిగితే కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం పడనుంది.
జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ముడిసరుకుల ధరలు కంపెనీలకు భారంగా మారాయి. పామాయిల్ ధర ఏడాది ప్రాతిపదికన 21శాతం, చక్కెర ధర 18 శాతం పెరిగాయి. ముడి చమురు ఆధారిత ఉత్పత్తులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ధరలు కూడా అధికమయ్యాయి. దీంతో ఎఫ్ఎంసీజీ కంపెనీల నిర్వహణ లాభాల మార్జిన్లు 45 నుంచి 150 బేసిస్ పాయింట్ల వరకు తగ్గవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దసరా, దీపావళి సీజన్లో వినియోగదారుల కొనుగోళ్లు తగ్గకుండా కంపెనీలు ధరల పెంపును వాయిదా వేస్తున్నాయి. ఖర్చులను నియంత్రించేందుకు డిస్కౌంట్లు తగ్గించడం, ప్రకటనల వ్యయాలను కుదించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. అయితే ముడిసరుకుల ధరలు తగ్గకపోతే డిసెంబర్ నుంచి వినియోగదారులపై భారం మోపే అవకాశముంది.
నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. వ్యవసాయ కమోడిటీల ధరలు, భౌగోళిక రాజకీయ పరిణామాలను బట్టి డిసెంబర్ నుంచి ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ దిగుబడులు తగ్గితే ఆహార ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అయితే ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరల పెంపుపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. కంపెనీల నిర్ణయాలు, ముడిసరుకుల ధరల కదలికలపై తదుపరి పరిణామాలు ఆధారపడి ఉండే అవకాశం ఉంది.


