Dasara Festival 2026 : సనాతన ధర్మంలో అనేక పండుగలు చెడుపైన మంచి సాధించిన విజయాలకు ప్రతీకగానే జరుగుతుంటాయి. అలాంటి పర్వదినాల్లో విజయదశమి ప్రముఖమైంది. ఈసారి దసరా పండుగ అక్టోబర్ 20వ తేదీన జరుపుకోనున్నారు.
Also Read : Dasara Festival 2026 : దసరా రోజున ఈ మూడు ప్రత్యేక పరిహాలు చేయండి.. మీకు అదృష్టం పట్టినట్లే..!
విజయ దశమి రోజంతా మంచిదే అయినప్పటికీ.. ఇందులో విజయ ముహూర్తం ఎంతో ప్రత్యేకమైనదని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు. విజయ దశమి రోజున రవికి ఎనిమిది, ఏడు స్థానాల్లో సూర్యోదయ లగ్నానికి ఐదు, ఆరు లగ్నాల్లో ఉన్నటువంటి సమయాన్ని విజయ ముహూర్తం అంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ముహూర్తం అంటే 48 నిమిషాలు. వర్జ్య దుర్ముహూర్తాల్లేకుండా రవి బలంగా ఉన్నటువంటి సమయం విజయదశమి రోజు వస్తే దాన్ని విజయ ముహూర్తంగా పేర్కొంటారు. ఈ సమయంలో ఆరంభించే కార్యక్రమాల్లో తప్పకుండా విజయం వరిస్తుందని విశ్వాసం.
దసరా పండుగ రోజున విజయ ముహూర్తం మధ్యాహ్నం 01.59గంటల నుంచి 2.45 గంటల మధ్యలో ఉంటుంది. ఈ సమయంలో ఏ కొత్త పనినైనా, ప్రయాణమైనా.. ఇతర ఏ మంచి కార్యక్రమాలు ప్రారంభించినా ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయం సిద్ధిస్తుందని ప్రతీతి.
శమీ వృక్షానికి పూజ చేసే విధానం..
దసరా రోజు సాయంత్రం లేదంటే విజయ ముహూర్త సమయంలో జమ్మి చెట్టు (శమీ వృక్షం) వద్దకు వెళ్లి పూజ చేయడం మన సంప్రదాయం.
పాండవులు అజ్ఞాతవాసంకు వెళ్లేముందు తమ ఆయుధాలను ఈ చెట్టుపైనే దాచిపెట్టారని, తిరిగి విజయదశమి నాడే వాటిని తీసుకున్నారని పురాణ కథనం.
ముందుగా జమ్మి చెట్టు ఉన్న ప్రదేశం వద్దకు వెళ్లి ముందుగా చెట్టు వద్ద నేలను శుభ్రం చేయాలి.
కుంకుమ, పసుపు, అక్షితలు, పువ్వులతో చెట్టును అలంకరించాలి. ఆ తరువాత దీపం వెలిగించాలి.
శమీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కుంకుమ, పసుపు అక్షితలు, పువ్వులు సమర్పించాలి.
చెట్టు ఆకులను (శమీ దళాలు) భక్తితో తలపై ధరించాలి. ఇవి విజయానికి, అభయానికి సూచికలు.
నైవేద్యంగా పండ్లు, మిఠాయిలు సమర్పించి, హారతి చూపించాలి.
చివరగా కుటుంబ సభ్యులతో కలిసి శమీ దళాలను ఇంటికి తీసుకువచ్చి వాటిని పూజా స్థలంలో ఉంచుకోవాలి.


