- ట్యాంక్‌బండ్‌పై పూల జాతర..
- సద్దుల బతుకమ్మలో విజయ్-రష్మిక సందడి
- ఆటపాటలు, లేజర్ షోతో అదిరిపోయిన సంబరాలు
- ట్యాంక్‌బండ్‌పై మహా బతుకమ్మ ర్యాలీ
- పల్లె నుంచి పట్నం వరకు బతుకమ్మ సంబరం..
Saddula Bathukamma Celebrations : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటాయి. తీరొక్క రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు.. మహిళల కోలాటాలు.. జానపద గీతాలు.. ఆటపాటలతో ఊరూవాడా పూలవనంగా మారింది. సద్దుల బతుకమ్మ వేడుకలతో తెలంగాణ అంతటా పండుగ శోభ వెల్లివిరిసింది.
ట్యాంక్‌బండ్‌పై మహా బతుకమ్మ.. కళ్లు చెదిరే సంబరాలు :
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అమరవీరుల స్మారకం నుంచి మహా బతుకమ్మ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 700 మంది కళాకారులు, 600 మందికిపైగా మహిళలు పాల్గొని సందడి చేశారు. సంప్రదాయ దుస్తులు, రంగురంగుల పూల బతుకమ్మలు, జానపద నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
విజయ్ దేవరకొండ–రష్మిక సందడి.. :
ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సంబరాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్కతో పాటు సినీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్నారు. కళాకారుల ప్రదర్శనలు, మహిళల ఆటపాటలతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. రాత్రివేళ నిర్వహించిన ఫైర్వర్క్స్, లేజర్ షో సందర్శకులను ఆకట్టుకున్నాయి. సంప్రదాయానికి ఆధునిక హంగులు తోడవడంతో వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి.
పల్లె నుంచి పట్నం వరకు.. పూల పండుగ సందడి :
హైదరాబాద్‌కే పరిమితం కాకుండా మెదక్, ఆదిలాబాద్, జనగామ, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లోనూ బతుకమ్మ సంబరాలు ఘనంగా సాగాయి. మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు.


