కన్నడ అమ్మాయి కృతి శెట్టికి కెరీర్ ఆరంభంలో దక్కిన విజయాలు చూసి.. తోటి హీరోయిన్లు అసూయ చెంది ఉంటారు. కేవలం 17 ఏళ్ళ వయసులో ‘ఉప్పెన’ చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన ఆమె.. నేరుగా వంద కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టేసింది. దాని తర్వాత నానికి జోడీగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ కూడా మంచి విజయం సాధించింది. తెలుగులో కృతి నటించిన మూడో చిత్రం బంగార్రాజు కూడా ఓ మోస్తరుగా ఆడింది.
కానీ తర్వాత ఆమెను వరుసగా పరాజయాలే పలకరించాయి. మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ.. ఇలా కృతి నటించిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. మరోవైపు తమిళంలో ఆమె నటించిన సినిమాలన్నీ విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి. ఎల్ఐకే, వా వాతియార్.. కొంచెం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా అవీ ఫ్లాపే అయ్యాయి. దీంతో కృతి కెరీర్ క్లోజ్ అయిపోతుందేమో అనుకున్నారు.
కానీ ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా కృతికి క్రేజీ ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. ఆమె ఆల్రెడీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంక్రాంతి సినిమా ‘జనవరి 12 విడుదల’లో నందమూరి కళ్యాణ్ రామ్కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెకు బాలీవుడ్లో ఓ అవకాశం వచ్చింది. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దగ్గర సుదీర్ఘ కాలంగా అసిస్టెంట్గా పని చేస్తున్న విధి ఘోడ్గావ్కర్ దర్శకురాలిగా పరిచయం అవుతున్న సినిమాలో కృతి లీడ్ రోల్ చేస్తోంది.
విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో కృతిని కథానాయికగా వెల్లడిస్తూ సినిమాను అనౌన్స్ చేశారు కానీ.. హీరో ఎవరన్నది చెప్పలేదు. రోహిత్ శెట్టి ఫక్తు మాస్ మసాలా సినిమాలు చేస్తుంటాడు. ఆయన శిష్యురాలు మాత్రం కృతి శెట్టితో లవ్ స్టోరీ తీయబోతోంది. ఒకవైపు కృతిని వరుస ఫ్లాపులు పలకరిస్తున్నా.. బహు భాషల్లో అవకాశాలు అందుకోవడం విశేషమే. ఇప్పటిదాకా ఏం జరిగినా.. అనిల్ రావిపూడి సినిమా కాబట్టి ‘జనవరి 12 విడుదలతో తన ఖాతాలో ఒక విజయం పడుతుందని కృతి ఆశిస్తోంది. దీని తర్వాత జయం రవితో చేస్తున్న ఓ సినిమా తమిళంలో విడుదల కాబోతోంది.


