ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారమే స్వామివారి దర్శనాలకు చివరి రోజు అని నిర్వాహకులు ప్రకటించడంతో తొమ్మిదో రోజు భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మహాగణపతిని దర్శించుకున్నారు.మంగళవారం ఒక్కరోజే లక్ష మందికి పైగా భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులు భారీగా తరలిరావడంతో దర్శనం కోసం పొడవైన క్యూలైన్లు ఏర్పడ్డాయి. భక్తులు క్రమపద్ధతిలో క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు.విజయవాడ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఖైరతాబాద్‌కు వచ్చిన భక్త బృందానికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఖైరతాబాద్ పరిసరాలు సందడిగా మారాయి.
అర్ధరాత్రి 12 గంటల వరకే దర్శనాలు
సెప్టెంబర్ 25న వినాయక నిమజ్జనం నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే మహాగణపతి దర్శనాలకు అనుమతి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను చేపట్టాల్సి ఉండటంతో గురువారం దర్శనాలను నిలిపివేయనున్నారు.బుధవారం చివరి రోజు కావడంతో సుమారు మూడు లక్షల మంది భక్తులు మహాగణపతిని దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో దర్శన ఏర్పాట్లను మరింత విస్తృతం చేశారు.దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికీ స్వామివారి ప్రసాదం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అర్ధరాత్రి నుంచే సుమారు 10 క్వింటాళ్ల పులిహోర, శనగలు, దద్దోజనం సిద్ధం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిమజ్జనానికి పోలీసుల ప్రత్యేక ఏర్పాట్లు
మరోవైపు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పంజాగుట్ట ఏసీపీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఇప్పటికే నిమజ్జన రూట్ మ్యాప్‌ను ఖరారు చేశారు.ఖైరతాబాద్ ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి, పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ జహాంగీర్ యాదవ్, ఏసీపీ మురళీకృష్ణ క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలతో పహారా ఏర్పాటు చేశారు.
భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించడంతో పాటు నిమజ్జన ఏర్పాట్లపై కూడా అధికారులు దృష్టి సారించారు.చివరి రోజు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున దర్శనానికి వచ్చే వారు పోలీసులకు, నిర్వాహకులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.


