కామెడీకి గుడ్‌బై.. ఇకపై హీరోగా చేయను: సంపూర్ణేష్ బాబు

Must read

కామెడీ సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. ‘హృదయకాలేయం’, ‘సింగం 123’, ‘కొబ్బరిమట్ట’ వంటి సినిమాలతో ప్రేక్షకులను నవ్వించిన ఆయన.. పలు చిత్రాల్లో కామెడీ గెస్ట్ రోల్స్‌లోనూ కనిపించారు. అయితే ఇప్పటివరకు తన కామెడీ టైమింగ్‌తో అలరించిన సంపూర్ణేష్ బాబు.. ఇప్పుడు తన కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.

నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో సంపూర్ణేష్ బాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ‘బిర్యానీ’ అనే పాత్రలో కనిపించనున్న విషయం ఫస్ట్ లుక్ విడుదలైన సమయంలోనే ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ పాత్రల్లో కనిపించిన సంపూర్ణేష్.. ఈ సినిమాలో పూర్తిగా సీరియస్ పాత్రలో నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మీడియాతో మాట్లాడిన సంపూర్ణేష్ బాబు తన పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘ది ప్యారడైజ్’లో తనది చాలా సీరియస్ రోల్ అని తెలిపాడు. సినిమా చివర్లో తన పాత్రలో కొంత ఎమోషన్ కూడా ఉంటుందని చెప్పాడు. సినిమా మొత్తం నాని పాత్రకు దగ్గరగా ఉండే వ్యక్తిగా కనిపిస్తానని, నానికి క్లోజ్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నానని వెల్లడించాడు.

అంతేకాదు.. సినిమాలో తనకు యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయని సంపూర్ణేష్ బాబు చెప్పాడు. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డానని, ఇప్పటివరకు తాను చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ పాత్ర ఉంటుందని తెలిపాడు. ముఖ్యంగా ఈ సినిమాలో తన నుంచి ఎలాంటి కామెడీ ఉండదని స్పష్టం చేశాడు. ‘ది ప్యారడైజ్’ సినిమా తర్వాత ప్రేక్షకులు కొత్త సంపూర్ణేష్ బాబును చూస్తారని ఆయన పేర్కొన్నాడు.

తన భవిష్యత్ కెరీర్‌పై కూడా సంపూర్ణేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇకపై హీరోగా సినిమాలు చేయాలనే ఆలోచన లేదని, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్నమైన పాత్రలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపాడు. కొత్తగా ఉండే క్యారెక్టర్లు, డిఫరెంట్ పాత్రలు మాత్రమే ఎంచుకుంటానని చెప్పాడు. గతంలో చేసిన కొన్ని తప్పులను ఇకపై చేయనని స్పష్టం చేశాడు.

ఒకవేళ భవిష్యత్తులో హీరోగా సినిమా చేస్తే అది చాలా ప్రత్యేకమైన కథ, పాత్ర అయి ఉండాలని సంపూర్ణేష్ బాబు చెప్పాడు. కేవలం రొటీన్ కామెడీ హీరోగా సినిమాలు మాత్రం చేయనని తేల్చి చెప్పాడు. దీంతో ఇకపై సంపూర్ణేష్ బాబు నుంచి వరుసగా కామెడీ హీరో సినిమాలు కాకుండా.. కథకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తోంది.

నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు పోషిస్తున్న ‘బిర్యానీ’ పాత్ర ఎలా ఉంటుంది? ఇప్పటివరకు కామెడీ నటుడిగా చూసిన సంపూర్ణేష్‌ను సీరియస్ యాక్షన్, ఎమోషనల్ పాత్రలో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది సినిమా విడుదల తర్వాతే తెలియనుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!