Tuesday, September 8, 2026

ఫౌజీ, దాదా పోస్ట్‌పోన్ అవుతాయా..? మేకర్స్ నుంచి వచ్చిన క్లారిటీ ఇదే!

Must read

హైదరాబాద్: టాలీవుడ్‌లో డిసెంబర్ నెల భారీ సినిమాల బాక్సాఫీస్ పోరుకు వేదికగా మారబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ డిసెంబర్ 3న, నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘దాదా’ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ‘ఫౌజీ’ ఇంకా పూర్తి కావాల్సిన పనులు చాలా ఉన్నాయని, అనుకున్న తేదీకి సినిమా రాదని కొందరు ప్రచారం చేస్తుండగా.. ‘దాదా’ షూటింగ్‌కు బాలకృష్ణ గాయం కారణంగా బ్రేక్ రావడంతో ఆ సినిమా కూడా వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రకటించింది. అయితే నిర్మాణ పనులు ఇంకా పూర్తికావాల్సి ఉందని, దాంతో రిలీజ్ తేదీ మరోసారి మారే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ముఖ్యంగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఇతర సాంకేతిక కార్యక్రమాలు పూర్తి చేయడానికి మరింత సమయం అవసరమవుతుందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఇక బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దాదా’ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది. బాలయ్యకు గాయం కావడంతో షూటింగ్‌కు కొంతకాలం బ్రేక్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో డిసెంబర్ 24న రావాల్సిన సినిమా సమ్మర్‌కు వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపించింది.అయితే ఈ రెండు సినిమాల విషయంలో ప్రస్తుతం వినిపిస్తున్న పోస్ట్‌పోన్ వార్తలకు ఎలాంటి ఆధారం లేదని చిత్ర నిర్మాణ వర్గాల నుంచి సమాచారం అందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓటీటీ డీల్స్‌కు సంబంధించిన నిబంధనలు కూడా రిలీజ్ డేట్ మార్పుకు అవకాశం లేకుండా చేస్తున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల కాలంలో ఓటీటీ సంస్థలు భారీ సినిమాల డిజిటల్ హక్కులను కొనుగోలు చేసే సమయంలో థియేట్రికల్ రిలీజ్ తేదీలను కూడా ఒప్పందాల్లో స్పష్టంగా పేర్కొంటున్నాయి. సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే దానిపై ముందుగానే షెడ్యూల్ ఖరారు చేసుకుని డిజిటల్ హక్కులను కొనుగోలు చేస్తున్నాయి. ఒకవేళ ప్రకటించిన థియేట్రికల్ రిలీజ్ తేదీలో మార్పు జరిగితే.. ఓటీటీ ఒప్పందాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

కొన్ని ఒప్పందాల్లో విడుదల తేదీ మారితే చెల్లించాల్సిన మొత్తంలో కోతలు లేదా ఇతర నిబంధనలు ఉండే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది. భారీ మొత్తాలకు డిజిటల్ హక్కుల బిజినెస్ పూర్తయిన సినిమాలకు ఇలాంటి పరిస్థితులు నిర్మాతలకు ఆర్థికంగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలో ‘ఫౌజీ’, ‘దాదా’ చిత్రాల నిర్మాణ సంస్థలు ప్రకటించిన రిలీజ్ డేట్లను మార్చే ఆలోచనలో లేవని సమాచారం. మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి సినిమాలను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో తుది నిర్ణయం చిత్రబృందాల అధికారిక ప్రకటనపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం ప్రభాస్ ‘ఫౌజీ’ డిసెంబర్ 3న, బాలకృష్ణ ‘దాదా’ డిసెంబర్ 24న విడుదల కావాల్సి ఉంది. దీంతో డిసెంబర్‌లో ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!