తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానుండగా.. తొలిరోజు ప్రశ్నోత్తరాలతో సభా కార్యక్రమాలు మొదలుకానున్నాయి. సభ ప్రారంభమైన అనంతరం పలు కీలక నివేదికలను సభ ముందుకు తీసుకురానున్నారు. ‘తెలంగాణ సమగ్ర శిక్షణ’, ‘పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా’, మెట్రో రైలుకు సంబంధించిన ఆడిట్ నివేదికలను తొలిరోజు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం ఉభయ సభలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈసారి అసెంబ్లీ సమావేశాలు సుమారు నాలుగు నుంచి ఆరు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. అయితే చర్చించాల్సిన అంశాల ప్రాధాన్యత, సభలోని పరిస్థితులను బట్టి సమావేశాల గడువును మరింత పొడిగించే అవకాశం కూడా ఉంది. సభ పని దినాలు, చర్చించాల్సిన అంశాలు, అజెండా తదితర అంశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో చర్చించనున్నారు.
సభలో ఏయే అంశాలకు ఎంత సమయం కేటాయించాలనే దానిపైనా BACలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని సభా కార్యక్రమాలను ఖరారు చేయనున్నారు.
వెయ్యి రోజుల పాలనపై అధికారపక్షం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. తమ ప్రభుత్వం సాధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించేందుకు అధికారపక్షం సిద్ధమవుతోంది. వివిధ శాఖల పనితీరు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను అంశాల వారీగా సభలో ప్రస్తావించే అవకాశం ఉంది.
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను కూడా అధికార కాంగ్రెస్ ప్రస్తావించే అవకాశం ఉంది. దీంతో సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వాగ్వాదం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ
మరోవైపు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు, ప్రజా సమస్యలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల జాబితాలో సుమారు 20 అంశాలను చేర్చాలని బీఆర్ఎస్ బీఏసీ సమావేశంలో కోరనున్నట్లు తెలుస్తోంది. సమావేశాలను కేవలం నాలుగు లేదా ఆరు రోజులకు పరిమితం చేయకుండా నెల రోజుల పాటు నిర్వహించాలని కూడా ఆ పార్టీ డిమాండ్ చేసే అవకాశం ఉంది.
గన్‌పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్
సభ ప్రారంభానికి ముందు ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నిరసనగా అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సభలో, సభ వెలుపల ఎండగడతామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
కేసీఆర్ గైర్హాజరీపై ఆసక్తి
ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గైర్హాజరీలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం ప్రభుత్వాన్ని ఏ అంశాలపై ఎలా నిలదీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక అంశాలను సభలో ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారు.
మొత్తంగా ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా వాడీవేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తన వెయ్యి రోజుల పాలనను సమర్థించుకునేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో కీలక ప్రజా సమస్యలతో పాటు రాజకీయ అంశాలపై కూడా సభలో తీవ్ర చర్చ జరిగే అవకాశం ఉంది.




