సింగరేణి కాలరీస్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మారుపేర్ల సమస్యపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో ఈ అంశంపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల సమస్య పరిష్కారానికి ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
కమిటీ సమగ్రంగా పరిశీలించి సమర్పించే సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని భట్టి విక్రమార్క తెలిపారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.ఈ సమస్య ఇటీవల ఏర్పడింది కాదని, 1997 నుంచి సింగరేణిలో కొనసాగుతున్న పాత సమస్య అని ఉప ముఖ్యమంత్రి వివరించారు. అధికారిక రిజిస్టర్‌లో ఒక వ్యక్తి పేరు ఉండగా, ఆయన స్థానంలో మరొకరు విధులు నిర్వహించే పరిస్థితులు గతంలో ఉన్నాయని తెలిపారు. చట్టపరంగా ఒకరి పేరుతో మరొకరు ఉద్యోగం చేయడం తీవ్రమైన నేరపూరిత అంశమని పేర్కొన్నారు.అయితే అప్పట్లో సింగరేణి యాజమాన్యం కార్మికుల పరిస్థితులను మానవీయ కోణంలో పరిగణనలోకి తీసుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిందని భట్టి విక్రమార్క తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో 45 మంది అధికారులతో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం సింగరేణి కాలరీస్‌లో దాదాపు 90 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని భట్టి తెలిపారు. వీరిలో మారుపేర్ల సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య కేవలం 128 మంది మాత్రమేనని చెప్పారు. సంఖ్యాపరంగా ఇది పెద్ద సమస్య కాకపోయినప్పటికీ, దీనికి సంబంధించిన చట్టపరమైన అంశాల కారణంగా అధికారులు నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.ఒకవైపు భవిష్యత్తులో నిబంధనల ప్రకారం చర్యలు ఎదురవుతాయనే అధికారుల ఆందోళన, మరోవైపు సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. చాలా ఏళ్లుగా సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని చెప్పారు.ఎవరైనా అధికారులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి లేకుండా.. మొత్తం వ్యవహారాన్ని కమిటీ ద్వారా సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. చట్టపరమైన అంశాలతో పాటు కార్మికుల పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని కమిటీ తన నివేదికను సమర్పించనుంది.
కమిటీ నివేదిక అందిన వెంటనే 128 మంది మారుపేర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీంతో దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సంబంధిత సింగరేణి కార్మికుల్లో ఆశలు చిగురించాయి.




