Friday, June 26, 2026

పవన్ కళ్యాణ్ సరసన నటించడం నా అదృష్టం – నిధి అగర్వాల్

Must read

బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. ‘సవ్యసాచి’తో తెలుగు తెరపై అడుగుపెట్టిన నిధి, ‘ఇస్మార్ట్ శంకర్’తో ఘనవిజయం అందుకున్నారు. అయితే ఆ తర్వాత భారీగా మించిన విజయాలు రాలేదు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో అవకాశం రావడం, ఆమె కెరీర్‌కు కీలక మలుపుగా మారింది.

ఈ సినిమా గత ఐదేళ్లుగా సెట్స్‌పై ఉండగా, ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని జూలై 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ – “ఈ సినిమాలో పంచమి అనే పవర్‌ఫుల్ పాత్రలో నేను కనిపిస్తాను. ఇది చాలా వేషాలున్న పాత్ర. ఈ పాత్రకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులు, ఆభరణాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా క్లైమాక్స్‌లోని భరతనాట్యం నేపథ్య సన్నివేశం నాకు ఎంతో ఛాలెంజింగ్‌గా అనిపించింది,” అని చెప్పారు.

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడంపై ఆమె స్పందిస్తూ – “అయనతో స్క్రీన్ షేర్ చేయడం నిజంగా నా అదృష్టం. ఆయనకు గల స్టార్‌డమ్, అభిమానుల ప్రేమ వర్ణించలేనిది. ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంటే అది మిగతా వంద సినిమాలకు సమానం. ఆయనతో చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా సాహిత్యం పట్ల ఆయనకున్న ఆసక్తి గొప్ప విషయం,” అన్నారు.

దర్శకుడు క్రిష్, తర్వాత బాధ్యతలు స్వీకరించిన జ్యోతి కృష్ణ తమ పాత్రపై ఎంత శ్రద్ధ చూపారో వివరించారామె. “క్రిష్ కథ చెప్పినప్పుడే ఈ సినిమా చేయాలనిపించింది. అద్భుతమైన బృందం, పవన్ కళ్యాణ్ వంటి లెజెండరీ హీరో, ఎఎం రత్నం లాంటి ప్రతిష్ఠాత్మక నిర్మాత ఉన్న ప్రాజెక్ట్‌ను తిరస్కరించలేను,” అని అన్నారు.

నిర్మాత ఎఎం రత్నం పై ప్రశంసల వర్షం కురిపించిన నిధి – “ఐదేళ్లపాటు అన్ని ఒడిదుడుకులు ఎదురైనా, సినిమాపై విశ్వాసంతో నిలబడిన రత్నం గారికి హ్యాట్సాఫ్ చెబుతున్నాను,” అన్నారు.

‘హరి హర వీరమల్లు’ ట్రైలర్‌పై స్పందిస్తూ – “ట్రైలర్ విడుదలకు ముందు కొంత అనుమానత కలిగినవారు కూడా, ఇప్పుడు ట్రైలర్ చూసి సినిమా పై విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. కీరవాణి అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. ‘తార తార’, ‘కొల్లగొట్టినాదిరో’ పాటలు నాకు ఎంతో నచ్చాయి,” అన్నారు.

ఈ సినిమా మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఒక కల్పిత కథ అని, పవన్ కళ్యాణ్ ఇందులో ఇండియానా జోన్స్ తరహా రాబిన్ హుడ్ పాత్రలో కనిపించనున్నారని తెలిపారు.

ఇక రాబోయే ప్రాజెక్టులపై నిధి మాట్లాడుతూ – “ప్రభాస్‌తో ‘రాజాసాబ్’ సినిమాలో నటిస్తున్నాను. పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇద్దరూ ఎంత పెద్ద స్టార్స్ అయినా అంతే వినయంగా ఉంటారు. ఒక మంచి సహనటుడిగా, మంచి వ్యక్తిగా వారిద్దరినీ చూశాను. ప్రభాస్ నిజంగా ‘డార్లింగ్’ అనే పేరు అర్హించదగ్గ వ్యక్తి,” అంటూ ముగించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!