సూపర్ స్టార్ కృష్ణ ఇంట తీవ్ర విషాదం
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు అన్నయ్య ఘట్టమనేని రమేశ్ బాబు (56) కన్నుమూశారు.
ఆయన కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయన్ను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించేలోపే తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన మృతిచెందారు. భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం వరకు ఏఐజీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరచనున్నారు. రమేశ్ మరణ వార్తతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. రమేశ్‌బాబుకు భార్య మృదుల, కుమార్తె భారతి, కుమారుడు జయకృష్ణ ఉన్నారు. భారతి చదువుకుంటున్నారు. జయకృష్ణ.. చిత్రరంగ ప్రవేశం కోసం శిక్షణ పొందుతున్నారు. రమేశ్‌బాబు బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఐదేళ్ల వయసులో ఉండగా తండ్రి కృష్ణ సొంత చిత్రం 'అగ్నిపరీక్ష' ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత మోసగాళ్లకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, దేవదాసు, కురుక్షేత్రం, దొంగలకు దొంగ చిత్రాల్లో బాలనటుడిగా చేశారు. 15 ఏళ్ల వయసులో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'నీడ' చిత్రంలో ప్రధానపాత్రలో రమేశ్ బాబు నటించారు. ఈ చిత్రం వేడుకలో నాటి తమిళనాడు సీఎం కరుణానిధి చేతులమీదుగా జ్ఞాపికను అందుకున్నారు. ఆ తర్వాత నటనకు విరామం ఇచ్చి.. ఎనిమిదేళ్లు పూర్తిగా చదువుమీదే దృష్టిపెట్టారు. చెన్నైలోని లయోలా కాలేజీలో బీకాం పూర్తి చేశారు. తన 23వ ఏట హీరోగా మళ్లీ కెమెరా ముందుకొచ్చి సామ్రాట్ అనే చిత్రంలో నటించారు. ఇది హిందీలో వచ్చిన బేతాబ్ అనే చిత్రానికి రీమేక్. బేతాబ్ మాదిరే సామ్రాట్ చిత్రం ప్రేక్షకాదరణ పొందడం విశేషం. ఆ తర్వాత అన్నా చెల్లెలు, కృష్ణగారి అబ్బాయి, పచ్చతోరణం, నా ఇల్లే నా స్వర్గం, బ్లాక్‌టైగర్, ముగ్గురు కొడుకులు, చిన్ని కృష్ణుడు, బజార్‌రౌడీ, కలియుగ కర్ణుడు, ఆయుధం, మామా కోడలు వంటి చిత్రాల్లో రమేశ్‌బాబు నటించారు. చివరగా కృష్ణతో కలిసి ఎన్‌కౌంటర్ చిత్రంలో కనిపించారు. 15 చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన 1997 నుంచి నటనకు దూరంగా ఉన్నారు. ఆయన చేసిన సాహసయాత్ర, ప్రేమ చరిత్ర, అహో విక్రమార్క, భూలోక రంభ చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. 2004లో నిర్మాతగా మారి మహేశ్ బాబు హీరోగా అర్జున్, అతిథి, హిందీలో సూర్యవంశ్ చిత్రాలను నిర్మించారు. దూకుడు, ఆగడు చిత్రాలకు సమర్పకుడిగా వ్యహరించారు. కాగా రమేశ్‌బాబు మృతి పట్ల ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయి. అయితే ప్రస్తుతం కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అభిమానులు రావొద్దని కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి వారు ఓ ప్రకటన విడుదల చేశారు.
Share this article in your network!