టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2008లో ‘అష్టా చమ్మా’ సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమైన నాని.. ఆ తర్వాత హీరోగా, నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులకు నాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
సినిమాల్లోకి అడుగుపెట్టి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాని సోషల్ మీడియా వేదికగా తన భావాలను పంచుకున్నారు. ‘‘18 ఏళ్లు.. అధికారికంగా సినిమాల్లో పెద్దవాడినయ్యా’’ అంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తనపై అభిమానులు, ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోలేదని పేర్కొన్న నాని.. ఇకపై కూడా ఆ ప్రేమను అలానే గౌరవిస్తానని స్పష్టం చేశారు.
నాని హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘అష్టా చమ్మా’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2008 సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకున్న నాని.. ఆ తర్వాత విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకున్నారు.
హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా నాని తన ప్రయాణాన్ని విస్తరించారు. కథకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు చేయడంతో పాటు ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తన సహజమైన నటన, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో ‘నేచురల్ స్టార్’గా గుర్తింపు పొందారు.
ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదల తేదీ పలుమార్లు మారింది. తొలుత మార్చి 26న విడుదల చేయాలని నిర్ణయించగా.. అనంతరం ఆగస్టు 21కి మార్చారు. చివరకు సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది.
ఇటీవల విడుదలైన ‘ది ప్యారడైజ్’ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. రక్తంతో తడిసిన లుక్‌లో నాని కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. రెండు జడలతో కనిపిస్తూ, చేతిలో బ్లేడ్లతో రూపొందించిన గొలుసుతో నాని కనిపించిన సన్నివేశాలు టీజర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అణచివేతకు గురైన ప్రజలు తిరుగుబాటు చేయడం చుట్టూ కథ సాగుతుందనే సంకేతాలను టీజర్ ఇచ్చింది. ఈ సినిమాలో మోహన్‌బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘‘ఈ దేశం ఎవరిది? మనది’’ వంటి డైలాగ్‌లు టీజర్లో వినిపించడంతో కథపై ఆసక్తి మరింత పెరిగింది.
‘ది ప్యారడైజ్’ తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లిష్, స్పానిష్, బెంగాలీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. 18 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాని.. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’తో మరో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.




