Thursday, September 3, 2026

అంగన్వాడీ చరిత్రలో తొలిసారి.. నెల మొదటి తేదీనే సిబ్బంది ఖాతాల్లో జీతాలు

Must read

తెలంగాణ అంగన్వాడీ వ్యవస్థ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని అంగన్వాడీ సిబ్బంది పేర్కొన్నారు. సుమారు 50 ఏళ్ల అంగన్వాడీ చరిత్రలో తొలిసారిగా నెల మొదటి తేదీనే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాతాల్లో సెప్టెంబర్ నెల జీతాలు జమ అయ్యాయని తెలిపారు. నిర్ణీత సమయానికి వేతనాలు అందడంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకాలం జీతాల కోసం నెలలు గడిచినా ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉండేవని అంగన్వాడీ టీచర్లు గుర్తుచేశారు. వేతనాలు ఆలస్యంగా అందడం వల్ల కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు, ఇతర అవసరాలను నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపారు. అయితే ఇప్పుడు నెల ప్రారంభంలోనే జీతాలు ఖాతాల్లో జమ కావడం తమకు ఎంతో ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని అంగన్వాడీ సిబ్బంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవతో అంగన్వాడీ సిబ్బందికి ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకున్నారని వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. తమ సమస్యను ప్రభుత్వం పరిష్కరించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

అంగన్వాడీ సిబ్బంది కేవలం ప్రభుత్వ ఉద్యోగ విధులు నిర్వహించే సిబ్బంది మాత్రమే కాదని, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కీలకమైన సేవలు అందిస్తున్నారని వారు పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడం, చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యకు సంబంధించిన కార్యక్రమాల్లో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

అలాంటి సిబ్బంది వేతనాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఆత్మగౌరవాన్ని, భరోసాను కల్పించిందని అంగన్వాడీ టీచర్లు అన్నారు. “మొదటి తేదీ జీతం.. అంగన్వాడీ సిబ్బంది ఆత్మగౌరవానికి ప్రభుత్వం ఇచ్చిన భరోసా” అంటూ వారు సంతోషం వ్యక్తం చేశారు.

తమ కష్టాలను గుర్తించి, నిర్ణీత తేదీలో వేతనాలు అందేలా చర్యలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా అంగన్వాడీ సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఇదే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు కోరారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!