Saturday, June 6, 2026
Google search engine

మహిళల సమగ్ర అభివృద్ధికి శాఖల మ‌ధ్య సమన్వయం పెర‌గాలి

Must read

మహిళల అభివృద్ధి, సాధికారత, సమాన అవకాశాలు, భద్రత అంశాలపై పలు కీలక శాఖలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ఉన్న‌త స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్య, వైద్యం, పోలీస్, అటవీ, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు హాజరై తమ సూచనలు వెల్లడించారు. సమావేశంలో డీజీ చారు సిన్హా, పీసీసీఎఫ్ డా. సి. సువర్ణ, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టరేట్‌కు చెందిన సంగీతా సత్యనారాయణ, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ వెంకటేశ్ దోత్రే, మున్సిపల్ శాఖ కమిషనర్లు పాల్గొన్నారు.

మహిళల సమగ్ర సంక్షేమం కోసం శాఖల మధ్య సమన్వయం పెంపొందిస్తూ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. అభివృద్ధి, సమాన అవకాశాలు, రక్షణ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల అభిప్రాయాలు తెలుసుకుని, అంశాల వారీగా సబ్ కమిటీల ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతూ లింగ వివక్షను నిర్మూలించి మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలోనే లింగ సమానత్వ భావనను బలపరిచే విధంగా పాఠ్యాంశాలలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని చర్చించారు. ఉద్యోగ రంగంలో మహిళలకు సమాన హక్కులు, ప్రైవేటు రంగంలోనూ మ‌హిళ‌ల‌కు మెటర్నిటి బెనిఫిట్ యాక్ట్ అమ‌లు వంటి అంశాలపై విధాన పరమైన మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు.

ఈ స‌మావేశంలో మహిళా భద్రత అంశంపై విస్తృత చర్చ జరిగింది. మహిళా శిశు సంక్షేమ, పోలీస్ శాఖల సమన్వయంతో మ‌హిళా భ‌ద్ర‌త విష‌యంలో ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలు, డేటింగ్ యాప్స్ మరియు మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా జరుగుతున్న మోసాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక షీ సైబర్ ల్యాబ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించనున్నారు. పొక్సో కేసులు, మానవ అక్రమ రవాణా బాధితుల కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. పాఠశాల స్థాయి నుంచే స్వీయరక్షణ శిక్షణను తప్పనిసరి చేయడం ద్వారా బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాల్సిన అవసరాన్ని మంత్రి సీత‌క్క‌ ప్రస్తావించారు.

ఆరోగ్యం, పోషణ అంశంలో కూడా ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. పాఠశాలలు, హాస్టళ్లలో కిషోర బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రక్తహీనత వంటి సమస్యలను ముందుగానే గుర్తించాలని సూచించారు. అదనపు పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచాలని నిర్ణయించారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు గ్రామ స్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ వంటి వ్యాధుల స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే టీనేజీ బాలికల మానసిక ఆరోగ్యం, సోషల్ మీడియా మంచి చెడుల‌పై అవగాహన కల్పించేందుకు కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మ‌హిళా సంక్షేమానికి, ఆర్దిక సాథికార‌త‌కు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నార‌ని పేర్కొన్నారు.

సమాజంలో మహిళల గౌరవాన్ని కాపాడే దిశగా కూడా చర్యలు అవసరమని మంత్రి సీత‌క్క అభిప్రాయ‌ప‌డ్డారు. . మూమి థియేటర్లలో మహిళా హక్కులు, చట్టపరమైన శిక్షలపై అవగాహన ప్రకటనలు జారీ చేసే అంశాన్ని ప‌రిశీలించాల‌ని సూచించారు. పిల్లలపై లైంగిక నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని, మానవ అక్రమ రవాణా నియంత్రణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

సమావేశంలో వెలువడిన సూచనల అమలుకు అంశాల వారీగా సబ్ కమిటీలు ఏర్పాటు చేసి, తక్షణమే కార్యాచరణ బృందాలను నియమించాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రతి శాఖ సమన్వయంతో సమగ్ర చర్యలు చేపట్టాలని, నిర్ణయాల అమలుపై నిరంతర సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ, “మహిళల సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి పునాది. మహిళలకు భద్రత, సమాన అవకాశాలు, ఆరోగ్యం, గౌరవప్రద జీవనం కల్పించడం ప్రభుత్వ ధర్మం. ఈ సమావేశంలో వచ్చిన ప్రతి సూచనను కార్యాచరణ ప్రణాళికగా మార్చి వేగవంతంగా అమలు చేస్తాం” అని పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!