- రాహుల్‌కు అమిత్ షా అదిరిపోయే కౌంటర్
- మాక్ పార్లమెంటులోనే ఉండిపోండి.. రాహుల్‌పై షా సెటైర్ల వర్షం
- 1984 అల్లర్లను గుర్తుచేస్తూ కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
- చలో ఢిల్లీ ర్యాలీపై నడ్డా విమర్శలు.. బీజేపీ వర్సెస్ విపక్షాలు
Amit Shah-Rahul Gandhi : ప్రధాని కావాలనే ఆశ ఉంటే జీవితాంతం మాక్ పార్లమెంటులోనే ఉండిపోవాల్సిందేనంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెటైర్లు వేశారు. ప్రతిపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు..
అబద్ధాలు ప్రచారం చేయడం, అరాచకాన్ని సృష్టించడం, పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడమే విపక్షాల అసలు అజెండా అంటూ విమర్శించారు. చండీగఢ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు..
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై అమిత్ షా నిప్పులు చెరిగారు. 1984 నవంబర్ 1న వేలాది మంది సిక్కులను ఊచకోత కోశారని, ఓ రాజకీయ పార్టీ రెచ్చగొట్టడంతోనే దేశం ఇలాంటి హింసను చూడాల్సి వచ్చిందని ఆరోపించారు. అలాంటి విషాద ఘటన జరిగిన రోజే రాంలీలా మైదానంలో సభ నిర్వహించడం బాధితుల గాయాలపై కారం చల్లినట్లేనని వ్యాఖ్యానించారు..
Read Also :
ఆ కేసులను తిరిగి తెరిచాం.. :
2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1984 అల్లర్లకు సంబంధించిన కేసులను తిరిగి తెరిచామని అమిత్ షా చెప్పారు. హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించామని, అల్లర్లలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకుని జైలుకు పంపించామని పేర్కొన్నారు..
‘చలో ఢిల్లీ’ ర్యాలీపై జేపీ నడ్డా విమర్శలు :
మరోవైపు, విపక్షాల ‘చలో ఢిల్లీ’ ర్యాలీపై బీజేపీ నేత జేపీ నడ్డా కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఈ ర్యాలీ ఓ మూర్ఖపు నాటకమని అభివర్ణించారు. ఢిల్లీలో అరాచకం సృష్టించడం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడం, పండగ సీజన్‌లో వ్యాపారులు, దుకాణదారులకు నష్టం కలిగించడం, దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడమే దీని లక్ష్యమని ఆరోపించారు..
భారత్ బలమైన ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ప్రభుత్వాలు అల్లర్ల రాజకీయాలతో కాకుండా రాజ్యాంగం, ప్రజల తీర్పుతో నడుస్తాయని నడ్డా స్పష్టం చేశారు. దీంతో విపక్షాల నిరసనల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ మాటల యుద్ధం మరింత ముదిరింది..



