PAK vs ENG : ఆదివారం అద్భుతం చేసిన పాక్‌.. ఇంగ్లాండ్ పై సంచ‌ల‌న విజ‌యం.. న‌భూతో న‌భ‌విష్య‌త్..!

Must read

PAK vs ENG : ఎప్పుడు ఎలా ఆడుతుందో అంచ‌నా వేయ‌లేని జ‌ట్టు పాకిస్థాన్‌. ఓ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడితే మ‌రో మ్యాచ్‌లో చిత్తుచిత్తుగా ఓడిపోతుంది. ముక్కోణ‌పు సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న‌ట్లు ఆడింది.

242 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో 154 ప‌రుగుల‌కే 9 వికెట్లు కోల్పోయింది. పాక్ గెలుస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌దు. క‌నీసం ఆ దేశ అభిమానులు సైతం. అయితే.. ఆఖ‌రి బ్యాట‌ర్ హ‌రీస్ రవూఫ్ (7 నాటౌట్; 19 బంతుల్లో 1 ఫోర్‌)తో క‌లిసి షాదాబ్ ఖాన్ (113 నాటౌట్; 96 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) అద్భుత‌మే చేశాడు. ఆఖ‌రి వికెట్‌కు అభేద్యంగా 89 ప‌రుగులు జోడించి జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని అందించాడు. ఈ విజ‌యంతో పాకిస్థాన్ ముక్కోణ‌పు సిరీస్ ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది.

ఈ మ్యాచ్‌లో బెన్ డ‌కెట్ (105; 111 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేయ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 46.4 ఓవ‌ర్ల‌లో 241 ప‌రుగుల‌కు ఆలౌటైంది. సామ్ క‌ర‌న్ (42; 52 బంతుల్లో 5 ఫోర్లు), గస్ అట్కిన్సన్ (36 నాటౌట్; 28 బంతుల్లో 3 సిక్స‌ర్లు) రాణించారు. టామ్ బాంటన్ (4), జోరూట్ (5), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (1), జోర్డాన్ కాక్స్ (6) లు ఘోరంగా విఫ‌లం అయ్యారు. పాకిస్థాన్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ షాహీన్ అఫ్రిది నాలుగు వికెట్లు తీశాడు. అరాఫత్ మిన్హాస్, రజావుల్లా చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. హ‌రీస్ ర‌వూఫ్ ఓ వికెట్ సాధించాడు.

అనంత‌రం 242 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పాకిస్థాన్ 47.1 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాకిస్థాన్ బ్యాట‌ర్ల‌లో షాదాబ్ ఖాన్ (113 నాటౌట్; 96 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేశాడు. సాద్ బైగ్ (32), స‌ల్మాన్ అఘా (26) ప‌ర్వాలేద‌నిపించ‌గా బాబ‌ర్ ఆజామ్ (10), ఫ‌ఖ‌ర్ జమాన్ (10), సైమ్ ఆయూబ్ (6), హసన్ నవాజ్ (15) లు విఫ‌లం అయ్యారు.

ఓ ద‌శ‌లో 154 ప‌రుగుల‌కే 9 వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికి కూడా హ‌రిస్‌తో క‌లిసి షాదాబ్ ఖాన్ అద్భుతంగా ఆడాడు. అత‌డే ఎక్కువ‌గా స్ట్రైక్ తీసుకుంటూ బౌండ‌రీలతో చెల‌రేగి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జేమీ ఓవర్టన్ మూడు వికెట్లు తీశాడు. గస్ అట్కిన్సన్, లియామ్ డాసన్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. హెన్రీ క్రోకోంబ్, విల్ జాక్స్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!