-
- హర్మన్‌ప్రీత్, దీప్తి శతకాల సునామీ.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం
- 21 పరుగులతో జింబాబ్వే చిత్తు.. ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు
- 3 మ్యాచ్‌ల సిరీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సొంతం
IND W vs ZIM W : భారత మహిళల జట్టు మరోసారి తన సత్తా చాటింది. బ్యాటింగ్‌లో భారీ స్కోరు.. బౌలింగ్‌లో కట్టుదిట్టమైన ప్రదర్శనతో జింబాబ్వేను మట్టికరిపించింది. బరోడా వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా 121 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకుంది.
హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. దీప్తి సెంచరీ :
టాస్ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించింది. 121 బంతుల్లో 15 ఫోర్లతో 126 పరుగులు చేసి జట్టు స్కోరును పరుగులు పెట్టించింది.
మరోవైపు ప్రతికా రావల్ 67 బంతుల్లో 61 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ కూడా ఏమాత్రం తగ్గలేదు. కేవలం 86 బంతుల్లో 15 ఫోర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. దీంతో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు సెంచరీలతో మెరిసింది.
భారత బౌలర్ల దెబ్బకు జింబాబ్వే చిత్తు :
329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. మోడెస్టర్ ముచిపకివా 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, చిపో ముగెరి-ట్రిపానో 46, బెలోవెడ్ బిజా 34 పరుగులు చేశారు.
వైష్ణవి శర్మ 3 వికెట్లతో జింబాబ్వే బ్యాటింగ్‌ను దెబ్బతీసింది. మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేక తేలిపోవడంతో జింబాబ్వే 48.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించిన భారత మహిళల జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి వన్డేలోనూ ఇదే జోరు కొనసాగించి క్లీన్ స్వీప్ సాధించాలని పట్టుదలతో కనిపిస్తోంది..


