MS Dhoni : ఐపీఎల్ – 2027 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరపున భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడే విషయంపై మరోసారి చర్చ మొదలైంది. గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ధోని ఆడలేదు. అయితే, వచ్చే సీజన్లో ధోనీ మైదానంలోకి అడుగుపెడతారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మరోవైపు డిసెంబర్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిటెన్షన్ లిస్ట్ విడుదల చేయడంతో పాటు మినీ వేలం జరగనుంది. ఈ క్రమంలో వచ్చే సీజన్ ఐపీఎల్లో ఆడతారా లేదా అన్న ప్రశ్నకు ధోనీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
బెంగళూరులో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు వైద్యులు ఐపీఎల్లో ఆడే విషయంపై ప్రశ్నించగా ధోనీ స్పందించారు. మరో సీజన్ ఆడాలని ఉందా అని అడిగినప్పుడు.. ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆ తర్వాత తన శారీరక సామర్థ్యాన్ని అంచనా వేసుకుని నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. ‘డాక్టర్లు.. నేను ముందుగా పరీక్షలు చేయించుకోవాలి. మీరు నివేదిక ఇవ్వాలి. ఆ తర్వాత డిసెంబర్‌లోపు మరో సీజన్ ఆడగలిగేంత బలంగా ఉన్నానో లేదో చూసుకోవాలి” అని ధోనీ సరదాగా వ్యాఖ్యానించారు.
మరో సీజన్ ఆడే స్థితిలో లేకపోతే, తన ఫిట్నెస్ను జాగ్రత్తగా చూసుకుని పాత వాహనం కూడా రోడ్డుపై సజావుగా నడిచేలా చూడాలని వైద్యులతో ధోనీ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో వచ్చే ఐపీఎల్ లో ఆడే విషయంపై ధోనీ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతుంది.
ధోనీ 2026 ఐపీఎల్ సీజన్ మొత్తానికి పిక్క కండరాల సమస్యతో దూరమయ్యాడు. దీంతో 2027 సీజన్లో అతడు ఆడతాడా లేదా అనే ప్రశ్న అభిమానుల్లో నెలకొంది. అయితే, ఐపీఎల్‌కు తన రిటైర్మెంట్పైనా ధోనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇదే కార్యక్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రదర్శనను కూడా ధోనీ ప్రశంసించాడు. గత రెండు సీజన్లలో ఆర్సీబీ స్థిరంగా రాణించిందని, అదే సమయంలో సీఎస్కే ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని అంగీకరించాడు. జట్టులో గాయాలను తగ్గించుకోవడం, ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు టోర్నీ మొత్తం అందుబాటులో ఉండేలా చూసుకోవడం, ప్రతి ఆటగాడికి తన పాత్రపై స్పష్టత ఉండటం ముఖ్యమని పేర్కొన్నాడు.
#WATCH | Bengaluru, Karnataka | On his IPL future, Former Indian Cricket Team Captain Mahendra Singh Dhoni says, “I’ll have to go through the tests. You’ll have to give me the report, and before December, I’ll need to assess how strong I am and whether I can play one more season. If I’m not fit enough, then you’ll have to make sure you do everything right to get this old vintage vehicle running smoothly on the road…”
(24.10)
— ANI (@ANI) October 24, 2026


