Sonia Gandhi : కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో తొలి పరిచయం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఓ చిన్న గ్రీక్ రెస్టారెంట్లో తమ ప్రేమకథ ప్రారంభమైందని గుర్తుచేసుకున్నారు. తన ఆత్మకథపై రాబోయే పుస్తకం ‘బిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) విడుదలకు ముందు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో తొలిసారి పోస్ట్ చేస్తూ వీడియో ద్వారా ఈ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ పుస్తకం నవంబర్ 10న విడుదల కానుంది.
సోనియా గాంధీ తన వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం.. 1965లో రాజీవ్ గాంధీతో తన తొలి పరిచయాన్ని పంచుకున్నారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో చదువుకుంటున్న రోజుల్లో అక్కడ ఆహారం అంత బాగుండేది కాదు. తనకు నచ్చిన ఆహారం, ముఖ్యంగా ఇటాలియన్ వంటకాలు లభించే రెస్టారెంట్ కోసం వెతికేదాన్ని. ఆ సమయంలో యూనివర్శిటీలో ‘వర్సిటీ రెస్టారెంట్’ పరిచయమైంది. అది గ్రీక్ రెస్టారెంట్ అయినప్పటికీ, యూరప్‌తో పాటు భారత్‌కు చెందిన విద్యార్థులు కూడా అక్కడికి తరచూ వచ్చేవారు. అదే రెస్టారెంట్లో రాజీవ్ గాంధీని తొలిసారి కలిశానని సోనియా గుర్తుచేసుకున్నారు.
తమ ఇద్దరికీ పరిచయమున్న ఓ స్నేహితుడు రాజీవ్ గాంధీని తనకు పరిచయం చేశారని సోనియా తెలిపారు. తొలి చూపులోనే ఆయనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనే భావన తనలో కలిగిందని చెప్పారు. రాజీవ్ అందంగా ఉండటంతో పాటు ఎంతో సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అని, ఆయనలోని ప్రశాంతత తనను ఆకట్టుకుందని వివరించారు. తనకు కలిగిన భావన రాజీవ్‌కు కూడా ఉందని తర్వాత తెలుసుకున్నట్లు వెల్లడించారు.
తొలి పరిచయం తర్వాత ఇద్దరం స్నేహితులం అయ్యాం. ఇతర విద్యార్థులతో కలిసి పార్టీలకు వెళ్లడం, వివిధ ప్రాంతాలను సందర్శించడం వంటి సందర్భాల్లో మరింత దగ్గరయ్యాం. ఓ వాలెంటైన్స్ డే పార్టీకి కూడా వెళ్లినట్లు సోనియా గుర్తుచేసుకున్నారు. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, చివరకు వివాహ బంధానికి దారితీసింది. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ 1968 ఫిబ్రవరి 25న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ భారత రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగి, 1984 నుంచి 1989 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. 1991 మేలో ఎన్నికల ప్రచార సమయంలో హత్యకు గురయ్యారు.
‘బిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో సోనియా గాంధీ తన జీవితంలోని వ్యక్తిగత అనుభవాలను ఈ పుస్తకంలో పంచుకోనున్నారు. యుద్ధానంతర ఇటలీలో తన బాల్యం, రాజీవ్ గాంధీతో ప్రేమ, భారత్‌కు రావడం, జీవితంలో ఎదురైన వ్యక్తిగత విషాదాలు వంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి. తొలుత ఈ పుస్తకం ప్రచురణ విషయంలో పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియాతో విభేదాలు తలెత్తగా, ప్రస్తుతం హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురణ బాధ్యతలు చేపట్టింది. నవంబర్ 10న పుస్తకం విడుదల కానుంది.
In a small Greek restaurant in Cambridge my journey of love began.
Rajiv and I created a world filled with love, laughter and memories. On 10th November, I share that world with you. https://t.co/zvN5Rqqstf
— Sonia Gandhi (@SoniaGandhi) October 24, 2026


