Operation Trident: భారతదేశాన్ని ‘డ్రగ్స్ రహిత భారత్’గా మార్చే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ ట్రైడెంట్’ (Operation Trident) భారీ విజయాన్ని సాధించింది. భారత్-మయాన్మార్-బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా సాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను తుడిచిపెట్టేందుకు కేంద్ర ఏజెన్సీలతో పాటు ఈశాన్య రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా ఈ సుదీర్ఘ ఆపరేషన్ నిర్వహించారు. 2029 డిసెంబర్ 31 నాటికి దేశంలో డ్రగ్స్ రవాణాకు పూర్తిగా చరమగీతం పాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విరోచిత చర్యలకు శ్రీకారం చుట్టింది.
3 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు.. రూ.100 కోట్ల హవాలా గుట్టురట్టు:
ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా మణిపూర్, అసోం, మిజోరం రాష్ట్రాల్లోని 38 సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఏకకాలంలో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్‌కు చెందిన 18 మంది ప్రధాన స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా, ఈ నెట్వర్క్ వెనుక ఉన్న దాదాపు రూ.100 కోట్ల హవాలా లావాదేవీల గుట్టును రట్టు చేయడమే కాకుండా, దానికి సంబంధించిన 1,424 బ్యాంక్ ఖాతాలను అధికారులు తక్షణమే సీజ్ చేశారు.
500 డిటొనేటర్ల స్వాధీనం.. విద్రోహ చర్యల కుట్ర సైతం భగ్నం:
అరెస్టు చేసిన స్మగ్లర్ల నుంచి డ్రగ్స్‌తో పాటు 500 డిటొనేటర్లను అధికారులు స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చే సొమ్మును విధ్వంసకర కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారనే అనుమానాలకు ఈ రికవరీ బలమైన నిదర్శనంగా నిలిచింది. సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడంతో పాటు డ్రగ్స్ మూలాలను కట్ చేయడమే ధ్యేయంగా కేంద్రం ఈ తీవ్రమైన చర్యలు కొనసాగిస్తోంది.


