- ఏపీ ప్రజలు అలర్ట్.. అక్టోబర్ 27 నుంచి దంచికొట్టనున్న వానలు
- బంగాళాఖాతంలో అల్పపీడనం, విశాఖ, కాకినాడకు వర్షగండం
- ఏపీతో పాటు తెలంగాణకూ వాన ముప్పు.. IMD తాజా అంచనాలివే
AP Weather Update : ఆంధ్రప్రదేశ్‌కు వర్షగండం పొంచి ఉందా? బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయా? భారత వాతావరణ శాఖ (IMD) అంచనాలతో ఏపీ, తెలంగాణ ప్రజల్లో ఆందోళన మొదలైంది.
మరోవైపు తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు మరింత మారే అవకాశం ఉండగా వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. :
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బలపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటే వాయుగుండంగా మారవచ్చని పేర్కొంటున్నారు. అయితే, తీవ్రత, ప్రయాణ దిశ, తీరం దాటే ప్రాంతంపై తాజా అధికారిక సమాచారాన్ని తెలుసుకోండి.
ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు :
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో అక్టోబర్ 27 నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, కాకినాడ జిల్లాల పరిసరాల్లో గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లే విషయంలో అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.
తెలంగాణలోనూ వర్షాలు :
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ప్రయాణాల సమయంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో నీరు నిలిచే రహదారులు, లోతట్టు ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
తమిళనాడులో కుండపోత.. :
తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రవాణాకు అంతరాయం ఏర్పడింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో వర్షాలపై ఎప్పటికప్పుడూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేస్తోంది.


