Telangana Ropeway Projects : తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని ఐదు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఆధునిక రోప్వేలునిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతిష్టాత్మక ‘పర్వతమాల’ పథకం కింద సుమారు రూ.1,230 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ రోప్‌వేలు అందుబాటులోకి వస్తే కొండలు, లోయలు, అడవుల అందాలను ఆకాశమార్గంలో రోప్‌వేల ద్వారా కేబుల్ కార్లలో ప్రయాణిస్తూ వీక్షించే అవకాశం పర్యాటకులకు లభిస్తుంది.
Also Read : Dasara Festival 2026 : దసరా రోజున ఈ మూడు ప్రత్యేక పరిహాలు చేయండి.. మీకు అదృష్టం పట్టినట్లే..!
ఈ ప్రాజెక్టులో ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన నాగార్జునకొండకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో విజయపురి నుంచి లాంచీల ద్వారా మాత్రమే కొండపైకి చేరుకోవాల్సి వస్తోంది. నీటిమట్టం తగ్గడం, ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోప్‌వే నిర్మాణంతో కృష్ణానది అందాలు, నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆకాశమార్గంలో వీక్షించే అవకాశం ఏర్పడనుంది.
యాదగిరిగుట్టలోని పెద్దగుట్ట టెంపుల్ సిటీ నుంచి ప్రధాన లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర రోప్‌వే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇది అమల్లోకి వస్తే భక్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతోపాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. అంతేకాక.. వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు తేలికగా కొండపైకి చేరుకునే అవకాశం లభిస్తుంది.
పెద్దపల్లి జిల్లాలోని చారిత్రక రామగిరి కోటకు కూడా రోప్‌వే నిర్మించనున్నారు. కొండ పాదం నుంచి కోట శిఖరం వరకు సుమారు 2.1 కిలోమీటర్ల మేర కేబుల్ కార్ల సదుపాయం కల్పించాలని ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం దట్టమైన అడవులు, రాతిబాటల గుండా ట్రెక్కింగ్ చేస్తూ కోటపైకి చేరుకోవాల్సి వస్తోంది. రోప్‌వే అందుబాటులోకి వస్తే కాళేశ్వరం, మంథని, రామగిరి ప్రాంతాలను కలిపి పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది.
నల్లగొండలోని హనుమాన్ హిల్ నుంచి సమీప గుట్ట వరకు 1.2 కిలోమీటర్ల మేర పర్యావరణహిత కేబుల్ కార్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇది పట్టణ ప్రజలకు కొత్త పర్యాటక ఆకర్షణగా మారనుంది.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ఖిల్లా రామాలయానికి రోప్‌వే ఏర్పాటు మరో ముఖ్యమైన ప్రాజెక్టు. అద్భుతమైన రాతి శిల్పకళతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ప్రస్తుతం 150కిపైగా నిటారైన మెట్లు ఎక్కాల్సి వస్తోంది. కొత్త సదుపాయం అందుబాటులోకి వస్తే వృద్ధులు, మహిళలు, ఇతర భక్తులకు దర్శనం సులభతరం కానుంది. పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) రూపకల్పన, తదుపరి అనుమతుల ప్రక్రియ కీలకం కానుంది.
రాష్ట్రంలో ఇప్పటికే భువనగిరి ఖిల్లా, ఖమ్మం ఖిల్లా వద్ద రోప్‌వే నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పుడు మరో ఐదు ప్రాంతాలకు కొత్త ప్రాజెక్టులు తోడైతే తెలంగాణలో ఆధ్యాత్మిక, చారిత్రక, ప్రకృతి పర్యాటకానికి మరింత ప్రాధాన్యం పెరగనుంది.


