నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో కీలక భాగంగా మారింది. ఫోన్ కాల్స్, ఆన్లైన్ పేమెంట్లు, బ్యాంకింగ్ లావాదేవీలు, ఫొటోలు, వ్యక్తిగత మెసేజ్‌లు.. ఇలా ఎన్నో ముఖ్యమైన వివరాలు మన మొబైల్లోనే ఉంటున్నాయి. అయితే, ఫోన్ భద్రత విషయంలో చేసే చిన్న పొరపాటు కూడా వ్యక్తిగత సమాచారానికి ముప్పుగా మారవచ్చు.
సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత వివరాలను దొంగిలించేందుకు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. అందుకే మొబైల్ భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. మీ ఫోన్లోని డేటాను కాపాడుకోవడానికి ఈ నాలుగు ముఖ్యమైన టిప్స్ పాటించండి.
1. స్ట్రాంగ్ పాస్‌కోడ్‌ను తప్పనిసరిగా పెట్టుకోండి
చాలామంది తమ మొబైల్ ఫోన్లకు 1234, 0000 వంటి సులభంగా ఊహించగలిగే పాస్‌కోడ్‌లను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి పాస్కోడ్ల వల్ల ఫోన్ ఇతరుల చేతుల్లోకి వెళ్లినప్పుడు వ్యక్తిగత సమాచారం బయటపడే ప్రమాదం ఉంటుంది.
అందుకే ఇతరులు సులభంగా ఊహించలేని పాస్‌కోడ్‌ను ఎంచుకోండి. మీ ఫోన్లో ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ అన్‌లాక్ సదుపాయం ఉంటే దాన్ని కూడా ఉపయోగించవచ్చు. అయితే, బయోమెట్రిక్ భద్రతతో పాటు బలమైన పాస్‌కోడ్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.
2. స్క్రీన్ ఆటో లాక్ సమయాన్ని తగ్గించండి
ఫోన్ ఉపయోగించిన తర్వాత లాక్ చేయడం మర్చిపోతున్నారా? అలా అయితే మీ వ్యక్తిగత సమాచారం ఇతరులకు కనిపించే అవకాశం ఉంటుంది. ఫోన్ అన్‌లాక్‌లో ఉన్నప్పుడు మీ మెసేజ్‌లు, ఫొటోలు, యాప్‌లలోని సమాచారం ఇతరులు చూడగలరు.
ఈ సమస్యను నివారించడానికి ఫోన్ సెట్టింగ్స్‌లో స్క్రీన్ ఆటో లాక్ లేదా స్క్రీన్ టైమ్అవుట్ సమయాన్ని 15 లేదా 30 సెకన్లకు సెట్ చేసుకోండి. ఫోన్ ఉపయోగించడం ఆపిన కొద్దిసేపటికే స్క్రీన్ లాక్ అయ్యేలా చూసుకోండి. అలాగే, ఇతరులకు ఫోన్ ఇచ్చేటప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని వారు చూడకుండా జాగ్రత్తపడండి.
3. లాక్ స్క్రీన్‌పై OTPలు కనిపించకుండా చూసుకోండి
బ్యాంకుల నుంచి వచ్చే OTPలు, వ్యక్తిగత మెసేజ్‌లు లాక్ స్క్రీన్‌పై కనిపిస్తే పక్కన ఉన్నవారు వాటిని చూడగలరు. ముఖ్యంగా బస్సులు, రైళ్లు, కార్యాలయాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇది మీ ప్రైవసీకి ఇబ్బందిగా మారవచ్చు.
మీ ఫోన్ నోటిఫికేషన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి లాక్ స్క్రీన్‌పై మెసేజ్ కంటెంట్ కనిపించకుండా మార్చుకోండి. అవసరమైతే సున్నితమైన యాప్‌ల నోటిఫికేషన్లను కూడా పరిమితం చేయండి.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బ్యాంకు అధికారులు, కస్టమర్ కేర్ సిబ్బంది పేరుతో ఎవరైనా అడిగినా OTP, PIN లేదా ఇతర రహస్య వివరాలను పంచుకోవద్దు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకుండా ఉండండి.
4. సాఫ్ట్వేర్ అప్డేట్స్ను నిర్లక్ష్యం చేయొద్దు
స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్స్లో కొత్త ఫీచర్లతో పాటు భద్రతా లోపాలను సరిచేసే మార్పులు కూడా ఉంటాయి. అప్డేట్స్ను చాలాకాలం వాయిదా వేయడం వల్ల కొన్ని భద్రతా సమస్యలకు ఫోన్ గురయ్యే అవకాశం ఉంటుంది.
అందుకే ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టమ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు చెక్ చేయండి. ఫోన్ తయారీ సంస్థ అందించే అధికారిక అప్డేట్స్ను ఇన్స్టాల్ చేసుకోండి. యాప్‌లను కూడా అధికారిక యాప్ స్టోర్ల నుంచే అప్డేట్ చేయండి. తెలియని వెబ్సైట్ల నుంచి యాప్‌లను డౌన్లోడ్ చేయడం మానుకోండి.
ఫోన్ భద్రత మీ చేతుల్లోనే!
స్మార్ట్‌ఫోన్‌లో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఫొటోలు, ముఖ్యమైన పత్రాలు ఉంటున్నందున దాని భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. బలమైన పాస్‌కోడ్, తక్కువ ఆటో లాక్ సమయం, లాక్ స్క్రీన్ నోటిఫికేషన్ల నియంత్రణ, సాఫ్ట్వేర్ అప్డేట్స్ వంటి సాధారణ చర్యలు మీ ఫోన్ భద్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఈ నాలుగు టిప్స్‌ను పాటించడంతో పాటు ఫోన్లోని ముఖ్యమైన డేటాకు బ్యాకప్ తీసుకోండి. అనుమానాస్పద యాప్‌లకు అనవసర అనుమతులు ఇవ్వకండి. చిన్న జాగ్రత్తలే మీ వ్యక్తిగత సమాచారాన్ని మరింత సురక్షితంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.


