
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే నెలల్లో నీరు, విద్యుత్ కొరత ఏర్పడే అవకాశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యాసంగి సీజన్లో అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు దూరంగా ఉండి, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు.
గురువారం ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో నీటి లభ్యత, విద్యుత్ అవసరాలు, వ్యవసాయ రంగంపై పడే ప్రభావం తదితర అంశాలపై మంత్రులు, సీనియర్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గతేడాదితో పోలిస్తే తగ్గిన నీటి నిల్వలు
రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు సీఎం వివరించారు. గతేడాది ఇదే సమయానికి అన్ని రిజర్వాయర్లలో కలిపి 400 టీఎంసీలకు పైగా నీరు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం సుమారు 209 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాగునీరు, సాగునీటి అవసరాలను సమతుల్యం చేసుకుంటూ నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సి ఉంటుందని సూచించారు.
హైదరాబాద్‌కు నీటిని అందించే జలాశయాల్లోనూ నీటి లభ్యతపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం.. రైతులు పెద్ద మనసుతో ఆలోచించి యాసంగిలో వరి సాగును నివారించాలని కోరారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం ద్వారా నీటి వనరులపై ఒత్తిడిని తగ్గించవచ్చని పేర్కొన్నారు.
అక్టోబర్‌లోనే పెరిగిన విద్యుత్ డిమాండ్
మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. సాధారణంగా అక్టోబర్ నెలలో సుమారు 15 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండేదని, ప్రస్తుతం డిమాండ్ 20 వేల మెగావాట్ల స్థాయికి చేరిందని చెప్పారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.
రాష్ట్రానికి అదనపు విద్యుత్ కేటాయించాలని, విద్యుత్‌పై ఇచ్చే సబ్సిడీలను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సీఎం తెలిపారు. ఎల్‌నినో కారణంగా రాష్ట్రాలు ఎదుర్కొనే ఇబ్బందులను అధిగమించేందుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కేబినెట్ సబ్‌కమిటీ.. అఖిలపక్ష సమావేశం
ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దసరా తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, వివిధ పార్టీల నేతలు, నిపుణుల సూచనలు తీసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.
ప్రకృతి విపత్తు వంటి పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని సీఎం కోరారు. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని, రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనవసర ఆందోళనకు గురికాకుండా, తప్పుడు ప్రచారాలను నమ్మకుండా సంయమనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.


